శనివారం ఉదయంకొలువు తీరిన తెలంగాణ అసెంబ్లీలో.. ఇటీవల ఫలితాలు వెల్లడైన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మాత్రం సభకు హాజరు కాకపోవటమే కాదు.. ప్రమాణస్వీకారం చేయలేదు. ఆయన ప్రమాణ స్వీకారానికి రాకపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం జరిగిన సభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా.. తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.
అయితే.. సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కాలేదు. ఇదే విషయాన్ని పార్టీ నేతల్ని వాకబు చేయగా.. తన తండ్రి కేసీఆర్ తుంటి ఎముకకు సర్జరీ చేయించే వేళలో.. తాను ఆసుపత్రిలోనే ఉన్నానని.. అందుకే రాలేదని పేర్కొన్నారు. తన ప్రమాణ స్వీకారానికి మరో రోజు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. తన తండ్రి కేసీఆర్ వెంట ఆసుపత్రిలో ఉన్నందుకు హాజరు కాలేదేన్న కేటీఆర్.. మరోవైపు తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి వెళ్లలేదు.
మొత్తంగా అసెంబ్లీలో జరిగిన ప్రమాణస్వీకారానికి వెళ్లకపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు కేటీఆర్ నిర్ణయాన్ని సరైనదేనని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తప్పు పడుతున్నారు. కేసీఆర్ మాదిరే కేటీఆర్ సైతం కాంగ్రెస్ నేతల నడుమ ప్రమాణస్వీకారం చేయటం ఇష్టం లేదని.. తప్పించుకోవటానికే తండ్రి ఆరోగ్యాన్ని సాకుగా చూపిస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. కష్టంలో ఉన్న వేళ.. ఆరోగ్య సమస్యలతో ఉన్న వేళలో విమర్శలు చేయటం సరికాదంటున్నారు.
మరోవైపు కేసీఆర్.. కేటీఆర్ లేకుండా జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి కేసీఆర్ ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా.. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్.. కడియం శ్రీహరిలు బలపరిచారు. మిగిలిన కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్ కు అప్పజెబుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.