పరిస్థితులు అనుకూలంగా లేనపుడు.. విజయం దక్కదనే అనుమానాలు ఉన్నపుడు ఏం చేయాలి? అదును కోసం ఎదురుచూడాలి.. అనువైన సమయం కోసం వేచి చూడాలి.. ఓపికతో వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. ఆలస్యమైన సరే గెలిచే పరిస్థితులు ఏర్పడే వరకూ ఓపికగా ఉండాలి. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యూహాన్నే అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. కరోనా పరిస్ఙితులను కారణంగా చూపి ఈ ఉప ఎన్నికను వీలైనంత ఆలస్యంగా నిర్వహించేలా చేయడంలో సఫలమయ్యారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ తనపై భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోవడంతో పార్టీని వదిలేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ శాసనసభ స్థానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోన్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికలో విజయం సాధించిన తన ఎమ్మెల్యే పదవిని నిలబెట్టుకుని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలనే పట్టుదలతో ఈటల ఉన్నారు. అందుకే ఆత్మగౌరవ నినాదంతో ప్రచారం హోరెత్తిస్తున్న ఆయన ప్రజల మద్దతును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రస్తుతం హుజూరాబాద్‌లో పరిణామాలు చూస్తే ఉప ఎన్నికలో ఈటలకే విజయం దక్కే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్థానిక ప్రజలతో పెనవేసుకున్న అనుబంధంతో ఆయనపై సానుభూతి వ్యక్తమవుతోంది. అన్యాయంగా ఈటలపై భూకబ్జా ఆరోపణలు మోపారని ప్రజలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాను రాజీనామా చేశాకే ఈ నియోజకవర్గంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని చెప్పి ఈ పనుల ఫలితాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో విజయవంతమవుతున్నారని తెలుస్తోంది.
దీంతో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగినా ఆయనే విజయం సొంతం చేసుకునే ఆస్కారముందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా తెలంగాణలో పండగల సీజన్ తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం కోరిక మేరకు ఇప్పట్లో హుజూరాబాద్‌లో ఎన్నిక లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో దీపావళి తర్వాతే ఇక్కడ ఎన్నికలు నిర్వహించే వీలుంది.
ఈ ఉప ఎన్నికను ఆలస్యంగా నిర్వహించేలా చూడడమే కేసీఆర్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఈటలపై ప్రజల్లో సానుకూలత ఉండగా టీఆర్ఎస్పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేసీఆర్ తెప్పించుకున్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లోనూ ఈ విషయమే తేలిందని సమాచారం. దీంతో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉందని భావించిన కేసీఆర్ కరోనాను సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీపావళి తర్వాత ఉప ఎన్నిక అంటే అప్పటివరకూ పరిస్థితుల్లో మార్పు వచ్చే వీలుంది. దళిత బంధు పథకం గురించి మరింత విస్త్రత ప్రచారం చేసి ప్రజలను టీఆర్ఎస్వైపు తిప్పుకునే వీలుంది. అంతే కాకుండా దొరికిన ఈ సమయంలో ఎలాగైనా ఈటలను దెబ్బ తీసేందుకు మరిన్ని ప్రణాళికలు సిద్దం చేసుకునే అవకాశం దొరికినట్లయిందనే టాక్ వినిపిస్తోంది.