తెలుగు అధికారి ఆకునూరి మురళిని ఇంటికి పంపేదాకా ఆగలేదు కేసీఆర్. కానీ తెలుగు తెలియని అధికారి స్మితా సబర్వాల్ ను మాత్రం నెత్తిన పెట్టుకుంటూ భలే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అంటే సిన్సియర్ గా ఉండడం కన్నా సిన్సియర్ గా ఉన్నామన్న భావన కలిగించే విధంగా సోషల్ మీడియాలో హల్చల్ చేసేవారికే కేసీఆర్ మద్దతు ఉంటుందా అన్న అనుమానాలూ లేకపోలేదు.
అదేవిధంగా తెలంగాణ వాకిట అధికారులు ఎంతో మంది టీఆర్ఎస్ ఎజెంట్లుగానే ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ విధంగా అప్పట్లో కేసీఆర్ చెప్పిన విధంగా ఓ స్వామిజీకి అనుబంధంగా వీరంతా పనిచేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.
వాస్తవానికి స్మితా సబర్వాల్ సిన్సియర్ ఆఫీసర్ గా ఒకప్పుడు పేరుంది. దీన్నెవ్వరూ కాదనరు. కానీ సీఎంఓకు వచ్చాక ఆమె ఆ స్థాయిలో ఉన్నారా లేదా అన్నదే సిసలు సందేహం. అంటే ప్రభుత్వ సంబంధ పనులు కన్నా ప్రజా సంబంధ పనులు కన్నా ప్రచార సంబంధ పనులే ఆమె ఎక్కువగా చేస్తున్నారా ఆ విధంగా టీఆర్ఎస్ నేతలకు అనుగుణంగా ఆమె నడుచుకుని ఉంటున్నారా.. అన్న అనుమానాలూ సందేహాలూ విపక్షం నుంచి వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆమె మాటలే ధ్రువీకరిస్తున్నాయి.
బిల్కిస్ బానో కేసుకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం సంబంధిత నిందితులకు క్షమాపణ పెట్టిన వైనం పై ఫక్తు టీఆర్ఎస్ అధికారిగానే ఆమె స్పందించారు అని ఆరోపణలు వస్తున్నాయి. స్వేచ్ఛాయుత దేశంలో తానున్నానా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె ఓ ప్రకటన ఇచ్చారు. సత్ప్రవర్తన కారణంగానే వాళ్లను విడుదల చేశారని, ముందుగా వీళ్ల అభ్యర్థనను గుజరాత్ సర్కారు పట్టించుకోకపోతే సుప్రీం జోక్యంతో వీళ్ల విడుదల సాధ్యం అయిందన్న వాదన ఒకటి బీజేపీ అనుకూల వర్గాల నుంచి ఇంకా ఇంకొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.
14 ఏళ్ల జైలు శిక్ష తరువాత సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసే అవకాశం ఉంటుందని, అందుకు జాతీయ పండుగలను సందర్భంగా చేసుకుని విడుదల చేస్తుంటారని, ఆ పాటి కూడా తెలియకుండా ఆమె ఎలా మాట్లాడగలుగుతున్నారని దుయ్యబట్టారు. ఏదేమయినప్పటికీ టీఆర్ఎస్ హయాంలో పనిచేస్తున్న అధికారులకు ఫక్తు అధికారిక ప్రతినిధుల్లా మాట్లాడడం అన్నది ఏం బాలేదు అన్న వాదన కూడా వస్తోంది.
టీఆర్ఎస్ సర్కారు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారు కాబట్టే ఆమెకు మంచి పోస్టులు దక్కుతున్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారు.