ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని, వైసీపీ తరఫున పోటీ చేసిన 25 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా సాధిస్తామని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ మాటను నమ్మిన జనం…నిజంగానే హోదా తెచ్చేస్తారన్న ఆశతో వైసీపీకి 22 మంది ఎంపీలను కట్టబెట్టారు. అయితే, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టి మూడున్నరేళ్లు గడిచాయి.
అయినా సరే, హోదా గురించి కేంద్రాన్ని వారు గట్టిగా నిలదీసిన పాపాన పోలేదు. ఇక, వైసీపీ అధినేత జగన్…కాలికి బలపం కట్టుకొని మరీ ఎన్నోమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లనా సరే గట్టిగా హోదా ఊసెత్తిన దాఖలాలు లేవు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి…సొంత ఎజెండా…లేదంటే పోలవరం నిధుల విషయం…తన కేసుల విషయం తప్ప మరో ఊసుండదని టాక్. ఈ సారి మోడీ సర్కార్ చాలా బలంగా ఉందని, కనుకు మోడీ సాబ్ ను హోదా అడగలేను సారీ అంటూ జగన్ గతంలో ఓ సారి చేతులెత్తేసి మరీ ప్రజలుకు సారీ చెప్పారు.
కేంద్రంలో ప్రభుత్వం మారితేనే హోదా విషయం తేలుతుందంటూ గతంలో జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అక్రమాస్తుల కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయంతోనే కేంద్రాన్ని జగన్ గట్టిగా హోదా గురించి అడగలేకపోతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోడీ విశాఖ టూర్ సందర్భంగా జగన్ స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి మహా ప్రభో అంటూ ఏదో ఫార్మాలిటీగా అడిగిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
మోడీతో, కేంద్ర ప్రభుత్వంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మోడీతో ఫెవికాల్ అంత గట్టి బంధం ఉందన్న జగన్…హోదా ఎందుకు తేలేకపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 32 కేసులున్న నేపథ్యంలో మోడీతో ఆ మాత్రం బలమైన బంధం జగన్ కు అవసరమేనంటూ చురకలంటిస్తున్నారు.