వ్యాక్సిన్ తయారీలో కొన్ని విధానాల్ని (ఎంఆర్ఎన్ఏ, హోల్ విరియన్ ఇనాక్టివేటెడ్,వెక్టర్, హెటెరోలోగస్) అనుసరించటం తెలిసిందే. తాజాగా కేంద్రం అనుమతులు ఇచ్చిన స్పుత్నిక్ వీ తయారీనే అనూహ్యమని చెబుతారు. దాన్ని తయారు చేసిన పద్దతిలోని విలక్షణత.. మిగిలిన టీకాలకు భిన్నంగా నిలుపుతుందంటారు. స్పుత్నిక్ టీకా తయారీ ఎలా సాగిందన్న విషయాన్ని చూస్తే..మనకు ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవీ షీల్డ్ వ్యాక్సిన్ లో చింపాంజీల్లో జలుబు కలిగించే ఎడినో వైరస్ ను వినియోగించింది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీలో ఇదే విధానాన్ని అనుసరిస్తారు. క్యాన్ సినో సంస్థ మనుషుల్లో జలుబు కలిగించే ఎడినో వైరస్ 5 రకాన్ని తమ టీకా తయారీలో వినియోగించింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఎడినో వైరస్ 26ను వాడింది. స్పుత్నిక్ తన టీకాను ఈ రెండింటి వైరస్ ను వాడటం ఒక విశేషంగా చెబుతారు.ఈ టీకాను రెండు డోసుల్లో ఇస్తారు. తొలుత ఇచ్చే డోసులో ఎడినో వైరస్ 26ను ఉపయోగించిన టీకాను వేస్తారు. అనంతరం రెండో డోసు (21 రోజులకు ఇస్తారు) ఎడినో 5 వైరస్ తో తయారు చేసిన వ్యాక్సిన్ ను రెండో డోసుగా ఇస్తారు.
ఇలా రెండు రకాల వైరస్ లతో తయారు చేసే టీకాల్ని ‘హెటెరో లోగస్’ వ్యాక్సిన్ గా పిలుస్తారు. జలుబును కలుగజేసే వైరస్ లో ప్రధానమైనవి ఏడీ5, ఏడీ 26 రకాలు. చాలామంది వీటిల్లో ఏదో ఒక దాని బారిన పడే అవకాశాలే ఎక్కువ. ఆ వైరస్ లలో ఏదో ఒకదాన్ని మాత్రమే వాహకంగా చేసుకొని తయారు చేస్తే సానుకూల ఫలితం ఉండదు. అందుకే.. రెండింటిని కలిపి స్పుత్నిక్ టీకాను తయారు చేశారు.దేశీయంగా స్పుత్నిక్ టీకాల్ని దాదాపు 85 కోట్ల డోసుల్ని తయారు చేయనున్నారు. అయితే.. ఇవన్నీ రెడ్డీ ల్యాబ్ మాత్రమే ఉత్పత్తి చేయవు.
దేశీయంగా పలు ఫార్మా కంపెనీలకు వీటిని తయారు చేసేందుకు అనుమతులు లభిస్తాయి. దేశీయంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేసే దేశాల్లో గ్లాండ్ ఫార్మా (25.2 కోట్లు).. హెటెరో (10 కోట్లు).. విర్చో బయోటెక్ (20 కోట్లు).. స్టెలిస్ బయోఫార్మా (20కోట్లు).. పానేసియా (10 కోట్ల) డోసులు తయారు చేయనున్నాయి. ఈ కంపెనీల్లో పానేసియా తయారు చేసే 10 కోట్ల డోసులు పూర్తిగా విదేశాలకే ఎగుమతి చేస్తారు. మిగిలిన 15 కోట్ల డోసుల్ని మాత్రం మిగిలిన కంపెనీలు తయారు చేసే వాటిల్లో 25 కోట్ల డోసులు భారత్ కు ఇచ్చి.. మిగిలిన 45 కోట్ల డోసుల్ని విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది.