తన ఇంటిపై ఎన్నడూ కనని వినని రీతిలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు, చోటా నేతలు.. భారీ ఎత్తున దాడికి పాల్పడినా.. తన పార్టీ కీలక నేతలను.. మాజీ ప్రజాప్రతినిధులను రాళ్లు కర్రలతో కొట్టినా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? నిత్యం గంటల తరబడి.. మీడియా ముందు.. మాట్లాడే.. చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు ఫుల్ సైలెంట్ అయిపోయారు? .. పన్నెత్తు మాట కూడా అనలేదే.. రీజనేంటి? ఇవీ.. ఇప్పుడు ఏపీ రాజకీయ నేతలనే కాదు.. సగటు పౌరుడిని సైతం తొలిచేస్తున్న ప్రశ్నలు.
నిజానికి పార్టీ నేతలపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులను చంద్రబాబు తీవ్రంగా ఖండిస్తున్నారు. గుంటూరు నుంచి నెల్లూరు వరకు పార్టీ నాయకులపై ఈగవాలినా ఆయన వెంటనే రియాక్ట్ అవుతున్నారు. స్వయంగా తను రంగంలోకి దిగడమో.. లేదా.. తనకు అత్యంత ఆప్తులైన నాయకులను వారి వద్దకు పంపడమో చేసి పరామర్శిస్తున్నారు. ధైర్యం నూరిపోస్తున్నారు. జగన్ సర్కారుకు వార్నింగులు ఇస్తున్నారు. మరి ఇప్పుడు.. `విషయం` తన దాకా వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ నాయకుడికీ లేని.. జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న తనపైనే.. వైసీపీ ప్రజాప్రతినిధి.. పొరుగు జిల్లాకు చెందిన నాయకుడు.. పెద్దగా జనాలకు కూడా తెలియని వ్యక్తి.. వచ్చి.. దాడికి పాల్పడడం అంటే.. ఇదేమంత చిన్న విషయం కాదు.
నిజానికి ఈ విషయంలో అప్పటికప్పుడు.. టీడీపీ నాయకులు.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. పార్టీ అధికార ప్రతినిధి.. కొమ్మారెడ్డి పట్టాభి.. సమీప ప్రాంతాలకు చెందిన మహిళలు, యువత రంగంలోకి దిగి.. జోగి దూకుడుకు అడ్డుకోక పోయి ఉంటే.. ఊహించని పరిణామమే ఎదురై ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుపై దాడే లక్ష్యంగా.. జోగి విజృంభించిన తీరు.. నిజానికి బాబే చెప్పుకొన్నట్టుగా.. ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగనిదనే చెప్పాలి. రాజకీయ కక్షలు.. కుట్రలు ఈ నాడు చంద్రబాబుకు కొత్తకాదు.. ప్రత్యర్థులు అంతకన్నా కొత్తకాదు. వైఎస్ సహా అనేక మంది ప్రత్యర్థులతో ఆయన ఢీ అంటే.. ఢీ అని ఎదురొడ్డి నిలిచిన హిస్టరీని సొంతం చేసుకున్నారు.
కానీ, ఇలా భౌతిక దాడులకు ఎవరూ ప్రయత్నించలేదు. ఎవరూ.. ఇలా ఒంటికాలిపై ఇంటిపైకి ఎగబడి.. దాడి చేసే ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ, ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. పన్నుకు పన్ను.. కన్నుకు కన్ను.. అంటున్న నాయకులు ప్రత్యర్థి కూటమిలో చెలరేగిపోతున్నారు. అంతేకాదు.. తనకు రక్షణ కల్పించాల్సిన(ప్రతిపక్ష నాయకుడిగా.. కేబినెట్ హోదా ఉంటుంది కనుక) పోలీసు వ్యవస్థ కూడా నేడు చేతులు ఎత్తేసిన పరిస్థితిని కనబరిచింది. వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనలో టీడీపీ నేతలపై లాఠీ చార్జీ చేయడం.. అంటే.. ఇంతకన్నా చిత్రమైన పరిస్థితి ఏముంటుంది? అంతేనా.. కమెండోల రక్షణలో ఉన్న చంద్రబాబు నివాసం వద్ద.. కనీసం.. ఎస్సై స్థాయి అధికారి కూడా లేరంటే.. దీని వెనుక ముందస్తు ప్లాన్ ఉందనే అంటున్నారు పరిశీలకులు.
మరి ఇంత జరిగిన తర్వాత.. చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? పన్నెత్తు మాట ఎందుకు అనలేక పోయారు..? కనీసం మీడియా ముందుకు ఎందుకు రాలేదు? పోనీ.. ఒక ప్రెస్ నోట్ అయినా.. ఎందుకు వెలువరించలేదు? ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయిన తర్వాత.. కూడా చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. మరి దీని వెనుక కారణాలు ఉన్నాయా? చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారు? ఈ ప్రశ్నలే.. ఇటు టీడీపీ నేతల్లోనూ.. అటు మేధావుల్లోనూ.. సాధారణ ప్రజల్లోనూ.. హల్చల్ చేస్తున్నాయి.
చంద్రబాబు వ్యూహాత్మక మౌనం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. ప్రస్తుతం తాను స్పందిస్తే.. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. మరింత రాజుకునే అవకాశం ఉంటుందనే దూరదృష్టి కనిపిస్తోందని అంటున్నారు. ఇది కూడా నిజమే. ప్రస్తుతం ఇరు వర్గాలు ఆవేశంలోనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా.. కూడా.. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడినా.. రెచ్చగొట్టే ధోరణి అవుతుంది. సో.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా.. ఆయన ఇప్పుడు మౌనంగా ఉండడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తోంది.
రెండో కారణం.. ఈ ఉద్రిక్తత వెనుక రాజకీయ కుట్ర ఏదైనా దాగి ఉందా? దీనిని రాజకీయంగా కంటే.. కూడా.. న్యాయపరంగానే విషయాన్ని తేల్చుకోవడం ద్వారా.. ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేయొచ్చనేది బాబు వ్యూహంగా కనిపిస్తోంది.
మూడో కారణం.. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని.. దాడులు చేస్తోందని.. గత కొన్నాళ్లుగా చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా తనపైనే దాడి చేసేందుకు ప్రయత్నించడం.. తన ఇంటి ముట్టడికే.. వైసీపీ ఎమ్మెల్యే రావడం వంటి పరిణామాలు.. ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వ నిజస్వరూపంపై ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈ సమయంలో తాను స్పందిస్తే.. ప్రజల దృష్టి ఈ దాడి నుంచి మళ్లించినట్టు అవుతుందని.. బాబు భావించి ఉండొచ్చు.
నాలుగో కారణం.. తన ఇంటిపై దాడి ఘటన వెనుక జరిగిన పరిణామాలు.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నిశితంగా చంద్రబాబు దృష్టి పెట్టారు.
అయ్యన్న పాత్రుడు కూడా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం.. బాబుకు ఇబ్బందిగా మారింది. తను కూడా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రిని ఇలా తిట్టిపోయడాన్ని.. బాబు కూడా సహించలేరు. సో.. ఇది కూడా బాబు మౌనానికి ఒక కారణంగా.. కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.