ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్య ఒకటి చేశారు.
వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. దాన్ని అధిగమించేందుకు వీలుగా.. విచిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్.. ఫూణె లోని సీరం సంస్థకు చెందిన కోవీషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్నారు.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచుకోవటానికి వీలుగా.. ఆ సంస్థ తన సాంకేతికతను దేశంలోని వ్యాక్సిన్ తయారీకి సిద్ధంగా ఉన్న ఫార్మా కంపెనీలకు బదిలీ చేసేలా భారత్ బయోటెక్ కు సూచన చేయాల్సిందిగా సీఎం జగన్ కోరుతున్నారు.
ఒక వ్యాక్సిన్ తయారీకి గుండెకాయ లాంటి సాంకేతికతను మిగిలిన పార్మా కంపెనీలకు పంచుకుంటే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
స్వతహాగా వ్యాపారస్తుడైన జగన్ కు.. కీలక సాంకేతికతను వేరే వారితో పంచుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందే. ఒకవేళ.. ఆయన చేసిన సూచన దేశ ప్రజల కోసం అయితే.. కొవాగ్జిన్ ది మాత్రమే ఎందుకు తీసుకోవాలి? కోవిషీల్డ్ ది కూడా ఎందుకు తీసుకోకూడదు. రానున్న రోజుల్లో బయలాజికల్ ఈ.. రెడ్డీ ల్యాబ్స్ సంస్థ కూడా ఉత్పత్తి చేస్తున్న టీకాల సాంకేతికతను కూడా దేశీయంగా వ్యాక్సిన్ తయారుచేసే సామర్థ్యం ఉన్న ఫార్మా కంపెనీలకు ఇవ్వాలన్న పాలసీ నిర్ణయాన్ని తీసుకోవాలన్న వాదనను ఎందుకు వినిపించరు?
కోవాగ్జిన్ ఈనాడు సంస్థల అధినేత రామోజీ కుమారుడు కిరణ్ వియ్యకుండి కంపెనీ కాబట్టే అన్న వాదన వినిపిస్తోంది. నిజానికి మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో కొవాగ్జిన్ కంపెనీఎవరిది? దాని యజమాని ఎవరు? లాంటి వ్యాఖ్యలు జగన్ నోటి నుంచి వచ్చాయి. ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థ.. తాను కుదుర్చుకునే డీల్ కు తగ్గట్లు వ్యవహరిస్తాయి.
పరిశోధన సమయంలో భారత్ కానీ భారీ పెట్టుబడి పెట్టి.. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా మౌలిక సదుపాయాల్ని కల్పించి ఉంటే.. ఇవాల్టి రోజున ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా?
తమకున్నపరిమిత వనరులతో పని చేస్తున్న సంస్థ నుంచి పెద్ద ఎత్తున టీకాలు వివిధ దేశాలు కొనుగోలు చేశాయి కానీ.. మన దేశం కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ చేపట్టలేదు కదా? ఈ రోజున వ్యాక్సిన్ డిమాండ్ పెరిగినంతనే.. సాంకేతికతను ఇతర ఫార్మా కంపెనీలకు షేర్ చేసేలా సూచన చేయాలని ప్రధాని మోడీకి లేఖ రాయటం షాకింగ్ గా మారింది. ఇలాంటి విధానపరమైన నిర్ణయాల విషయంలో కేంద్రం ఏ మాత్రం తొందరపడినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం మరింత ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
సాంకేతికతను బదిలీ చేయటం ద్వారా.. మేధో ఆస్తి హక్కులు.. పేటెంట్లు వంటివి అడ్డంకి కావని సింఫుల్ గా విషయాన్ని తన లేఖలోపేర్కొన్నా.. విషయమంతా దాని చుట్టూనే తిరుగుతుందన్నది మర్చిపోకూడదు. కోవాగ్జిన్ విషయంలోనే ఇలాంటి నిర్ణయం కన్నా.. దేశీయంగా ఉత్పత్తి చేసే అన్ని టీకా సాంకేతికతను ఇతరులతో పంచుకోవాలన్న మాట జగన్ నోటి నుంచి వచ్చి ఉంటే బాగుండేది. వేలెత్తి చూపించే అవకాశం ఉండేది కాదు.