నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన టైమ్ ట్రావెల్ సినిమా `ఆదిత్య 369`. ది టైమ్ మెషిన్ అనే నవల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. మోహిని హీరోయిన్ గా నటించగా.. టినూ ఆనంద్, అమ్రీష్ పురి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. 1991 జూలై 18న విడుదలైన ఆదిత్య 369 సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలుగు సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇకపోతే సుమారు 34 ఏళ్ల తర్వాత ఆదిత్య 369 రీ-రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 4కె డిజిటలైజేషన్, 5.1 సౌండ్ మిక్స్‌తో ఏప్రిల్ 4న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదిత్య 369 కి సంబంధించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెరపైకి స్తున్నాయి. అయితే ఈ టైమ్ ట్రావెల్ చిత్రంలో బాలయ్యకు జోడిగా కొత్త అమ్మాయి మోహినిని తీసుకొచ్చారు.
కానీ, ఆదిత్య 369లో హీరోయిన్ పాత్రకు మోహిని ఫస్ట్ ఛాయిస్ కాదు. మొదట బాలకృష్ణకు జోడిగా విజయశాంతిని అనుకున్నారు. అంతకుముందు బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో `భలే దొంగ`, `ముద్దుల మామయ్య` లాంటి సినిమాలు వచ్చాయి. ఆన్ స్క్రీన్ పై బాలయ్య, విజయశాంతి జోడి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే విజయశాంతిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావించారు. విజయశాంతి కూడా ఆదిత్య 369 మూవీ చేసేందుకు చాలా ఎక్సైట్ అయింది.
అయితే అప్పటికే విజయశాంతి చేతిలో చాలా కొత్త ప్రాజెక్ట్స్ ఉండటంతో.. షెడ్యూల్స్, డేట్ల సమస్య తలెత్తింది. చేసేదేమి లేక ఆదిత్య 369 మేకర్స్ కొత్త అమ్మాయిని వెతకడం మొదలు పెట్టారు. రాధను సెలెక్ట్ చేద్దామనుకున్నప్పటికీ.. ఆమె కొంచెం బొద్దుగా మారడంతో వెనక్కి తగ్గారు. ఇక చివరకు సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సూచన మేరకు అప్పటికే తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేసిన మోహినిని ఆడీషన్ చేసి హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అలా ఆదిత్య 369 చిత్రంతో మోహిని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.