ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తనకు తెలిసి మరే ఇతర ఇండస్ట్రీలో లేనంత ఈర్ష.. ద్వేషాలు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమా కార్యక్రమం జరిగినప్పుడు.. ఒకరినొకరు పొగుడుకోవటం.. గొప్పలు చెప్పుకోవటంలో ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా చెలరేగిపోయే దానికి.. తెర వెనుక వారి ఈర్షాద్వేషాలు ఎంతలా ఉంటాయన్న దానికి సంబంధించి తొలిసారి ఓపెన్ గా వర్మ మాట్లాడారని చెప్పాలి.
కాకతాళీయమో మరేమో కానీ.. సంచలనాల శ్రీరెడ్డి తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. గతంలో తాను చేసిన దారుణమైన తప్పునకు సోషల్ మీడియా సాక్షిగా చెంపలేసుకున్నారు. క్షమించాలని కోరారు. అంతేనా.. తనకు బ్రెయిన్ వాష్ చేసి మరీ.. మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఫ్యామిలీని లాగితే.. విషయానికి సీరియస్ నెస్ వస్తుందని తనకు నూరిపోశారని.. అందుకే చిరంజీవి తల్లి అంజనమ్మను ఉద్దేశించి తాను అప్పట్లో అలా మాట్లాడిన వైనాన్ని చెప్పుకొచ్చారు.
‘‘ఒక తల్లిని తిట్టాను. నేనేం తిట్టానో మీ అందరికి తెలుసు. దానికి శిక్ష కూడా అనుభవించాను. ట్రోల్స్ రూపంలోనూ.. ఫోన్ చేసి తిట్టటం లాంటివి జరిగాయి. మా వాళ్లు.. సొంతవాళ్లు కూడా అలా అనటం చాలా తప్పన్నారు. అప్పటినుంచి కూడా నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ఒక ఆడదాన్ని అన్యాయంగా తిట్టటం తప్పే. నేను ఒప్పుకుంటున్నాను. నా తప్పు. పెద్ద మనసు చేసుకొని పెద్దమ్మ తల్లి ఎలా క్షమిస్తుందో అలా క్షమించమని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో చిరంజీవి అనే వారు ఒక పెద్ద హీరో. వారి అమ్మను అనాల్సింది కాదు. నా బుద్ది గడ్డి తిని ఆమెను తిట్టటం జరిగింది. అది కూడా ఒక కాజ్ లా తిట్టానని నన్ను మభ్య పెట్టారు. అమ్మ వారి సాక్షిగా అంజనాదేవికి క్షమాపణలు కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
తనకు కొందరు నూరిపోసిన మాటల్నివిని.. తానుమెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన విషయాన్ని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీని.. చిరు తల్లిని తిట్టేయటానికి నోరు వచ్చిన శ్రీరెడ్డి.. ఈ రోజున సారీ చెప్పారు సరే.. మరి.. ఆమెకు తప్పుడు సలహాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని వెల్లడించాలి కదా?
తప్పు చేసినందుకు సారీ చెప్పటం మంచి పద్దతే. కానీ.. అన్న మాటలు ఊరికే పోవు. అయితే.. ఇదంతా ఏదో ఆవేశంతోనో.. బాధతోనో చేయలేదు. అదంతా కొందరి పోద్బలంతో జరిగింది కాబట్టి.. ఈ కుట్రకు కారకులు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీని దెబ్బ తీయటానికి.. వారిని తక్కువ చేసి చూపించటానికి.. వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికి భారీగా కుట్రలు జరుగుతుంటాయన్న వాదన తరచూ వినిపించేది.
తాజాగా శ్రీరెడ్డి కన్ ఫెషన్ రూపంలో బయటకు వచ్చిందని చెప్పాలి. మరి.. మాటలు అనేసిన శ్రీరెడ్డి.. అంతే ధైర్యంగా తనను అలా అనమని బ్రెయిన్ వాష్ చేసిన వారెవరన్న విషయాన్ని చెప్పటమే అసలుసిసలు ప్రాయశ్చితం అనటం తప్పేమీ కాదు. మీరేమంటారు?