ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. 2019కి ముందు వేరు.. ఇప్పుడు వేరు! ఎందుకంటే.. 2019కి ముందు.. పెద్దగా ఆటు పోట్లు ఎదురు కాలేదు. ఒకవేళ అలాంటివి ఎదరైనా.. రాజకీయంగానే ఎదురయ్యాయి తప్ప.. వ్యక్తిగతంగా మాత్రం కాదు. దీంతో పార్టీ నాయకులు.. నిలబడ్డారు. రాజకీయంగా పుంజుకున్నారు. చంద్రబాబు కూడా అదే దూకుడుతో ముందుకు సాగారు.
అయితే.. 2019 తర్వాత.. పార్టీ పరిస్థితి వేరు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏపీలో రాజకీయాలు ఊహాతీతంగా మారిపోయాయి. ఒకవైపు రాజకీయం.. మరోవైపు వ్యక్తిగత కక్షలు.. ఇంకోవైపు.. సొంత అజెండాలు.. ఇలా వైసీపీ వ్యూహాలతో టీడీపీ ఇరుకున పడిపోయింది. గతంలో ఇలాంటి పరిస్థితిని ఆ పార్టీ ఎన్నడూ ఎదుర్కోలేదు.
పార్టీకి మూలస్తంభాలుగా ఉంటారని.. ఉన్నారని..అనుకున్న నాయకులు కూడా పార్టీలు మారిపోయారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకొందరు.. వైసీపీ నేతలతో లాలూచీ పడ్డారు. దీంతో 2019 ఎన్నికల తర్వాత.. 2020 చివరి వరకు కూడా పార్టీ తీవ్రమైన కుదుపు ఎదుర్కొంది. నాయకులనుతమవైపు తిప్పుకోవడం.. టీడీపీ నుంచి గెలిచిన వారిని లోబరుచుకోవడం.. సామ దాన భేద దండోపాయాలతో వారిని టీడీపీకి దూరం చేయడంతో పార్టీ పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళన నెలకొంది.
మరోవైపు .. సామాజిక వర్గాల వారీగా.. టీడీపీకి బలంగా ఉన్న వారిని అణిచి వేసే ప్రక్రియకూడా సాగింది. సానుకూలం అయితే.. సహకరిస్తాం.. లేకపోతో.. సమస్య సృష్టిస్తాం.. అనే రేంజ్లో వ్యవహరించడంతో టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ.. మౌనం పాటించారు.
ఒకానొక దశలో పార్టీ జెండా పట్టుకునేందుకు కూడా జంకిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు రావడం.. పార్టీ కి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొంది. ఇక, చాలా మంది వ్యాపారంతో కూడిన నాయకులు.. తమ తమ వ్యాపాల కోసం.. కేసులు ఉన్న నాయకులు వాటి నుంచి తప్పించుకోవడం కోసం.. పార్టీకి దూరమయ్యారు.
దీనికితోడు వైసీపీ నుంచి ఒక ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు పని అయిపోయిందని.. ఆయన వయసు 70 + దాటిపోయిందని… సో.. ఇక, టీడీపీ ఉండదని.. ఆ పార్టీ ప్రస్థానం ముగిసిపోయిందని.. ప్రచారం చేశారు. ఎక్కడ ఏనాయకుడు నోరు విప్పినా.. ఇదే మాట వినిపించింది. ఇది కూడా నైతికంగా టీడీపీని ఇబ్బందికి గురి చేసింది. ఈ పరిణామంతో ఇక, టీడీపీ ఉంటుందా? ఉండదా? అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది.
ఇలాంటి సమయంలో పార్టీకి అండగా నిలబడిన వారు కొందరు ఉన్నారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకున్నవారు ఉన్నారు. పోలీసు కేసులు పెట్టినా.. జైలుకు వెళ్లిన వారు ఉన్నారు. వారే.. టీడీపీకి ఆది నుంచి వ్యవస్థాగతంగా వస్తున్న నిజమైన కార్యకర్త లు. వీరు వారసులు కారు. పదవులు కోరుకోరు. కానీ.. పార్టీ కోసం ఏమైనా చేసేందుకు ముందుకు వస్తారు.
పైగా విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు పట్ల ప్రాణం పెడతారు. ఇలాంటి వారు అన్ని సామాజికవ ర్గాల్లోనూ ఉన్నారు. ఇదే.. ఆ విపత్కర సమ యంలో పార్టీని నిలబెట్టింది. పార్టీ తరఫున గళం వినిపించేలా చేసింది. వీరి ఉత్సాహంతోనే చంద్రబాబు మళ్లీ పుంజుకున్నార నడంలో సందేహం లేదు.
వాస్తవానికి ఆది నుంచి కూడా పార్టీకి ఇలాంటివారే అండగా నిలిచారు. అయితే.. ఇప్పటికైనా.. చంద్రబాబు ఇలాంటి వారిని గుర్తించాలనేది పరిశీలకుల మాట. ఎంతసేపూ.. వారసులు.. సీనియర్ల బిడ్డలు.. అనే మాటను పక్కన పెట్టి .. పార్టీ కోసం.. ఎప్పుడు అవసరం అయితే.. అప్పుడు కదం తొక్కుతున్న ఇలాంటివారిని ప్రోత్సహిస్తే.. పార్టీ మనుగడకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో అయినా.. ఇలాంటి నిస్వార్థ కార్యకర్తలకు అవకాశం లభిస్తుందా? చంద్రబాబు అలాంటి సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తారా? అనేది వేచి చూడాలి.