తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధిక సీట్లను సాధిస్తుందన్న దానిపై ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మీడియాలోని కొన్ని సెక్షన్లు.. అధికార బీఆర్ఎస్ కు మొగ్గు ఉందని చెబుతుంటే.. ఇంకొన్ని మీడియా సంస్థలు విపక్ష కాంగ్రెస్ కే అవకాశాలు మొండుగా ఉన్నాయని చెబుతున్నాయి. ఇలాంటి వేళ.. వెలువడుతున్న సర్వే రిపోర్టులు సైతం ఇదే రీతిలో ఉండటం ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే – సీ ఓటరు సర్వే ప్రకారం తెలంగాణలో ‘హంగ్’ ఖాయమని స్పష్టం చేస్తుంటే.. అందుకు భిన్నంగా మరో రెండు సర్వే ఫలితాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా తమ సర్వే వివరాల్ని రెండు సంస్థలు వెల్లడించాయి. అందులో ఒకటి ఇండియా టీవీ కాగా రెండోది ఫ్యాక్టస్ మార్కెటింగ్ రీసెర్చ్ సర్వే. ఈ రెండు సర్వే రిపోర్టులు దగ్గరగా ఉండటం గమనార్హం. ఇండియా టీవీ సర్వే ప్రకారం.. అధికార బీఆర్ఎస్ కు 70 సీట్లు ఖాయమని.. కాంగ్రెస్ 34 సీట్లకు పరిమితమవుతుందని.. బీజేపీ ఏడు.. మజ్లిస్ ఏడు.. ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకుంటారని అంచనా వేశారు.
ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ రీసెర్చ్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ 73-78 సీట్లు.. కాంగ్రెస్ 25-30 సీట్లు.. బీజేపీ 6-10 సీట్లు.. మజ్లిస్ 7-8 స్థానాలు.. ఇతరులు ఒక స్థానాన్ని గెలిచే వీలుందన్న అంచనాల్ని వెల్లడించారు. ఓట్ల శాతానికి వస్తే ఇండియా టీవీ సర్వేలో బీఆర్ఎస్ కు 43 శాతం ఓట్ల షేరును ప్రస్తావిస్తే ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ రీసెర్చ్ సర్వేలో 42.5 శాతం వస్తాయని పేర్కొంది. అదే సమయంలో కాంగ్రెస్ కు ఇండియా టీవీ 37 శాతంగా పేర్కొంటే.. ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ రీసెర్చ్ మాత్రం 33.1శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి 11 శాతం ఓట్ల షేర్ వస్తుందఫ్యాకని ఇండియా టీవీ అంచనా వేయగా.. ష్యాక్ట్స్ మార్కెటింగ్ రీసెర్చ్ సర్వేలో బీజేపీకి 16.3 శాతం ఓట్లు వచ్చే వీలుందని పేర్కొంది.
ఒకే రోజు మూడు సంస్థల నుంచి వెలువడిన సర్వేల్లో రెండు బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ వస్తుందని అంచనా వేయగా.. మరో సంస్థ మాత్రం హంగ్ వస్తుందని చెప్పటంతో.. మరింత కన్ఫ్యూజన్ కు గురయ్యే పరిస్థితి. ఏమైనా.. ప్రధాన ప్రతిపక్షంతోపాటు.. రేసులో కీలక భూమిక పోషించే అవకాశం ఉన్న బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత ఎన్నికల ఫలితాల మీద మరింత స్పష్టత వస్తుందని మాత్రం చెప్పక తప్పదు.