దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించిన కీలక ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టేందుకు ఎంత కాలం పడుతుందన్న విషయంపై ముగ్గురు శాస్త్రవేత్తలు ప్రకటన చేశారు.
సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో కేంద్రం ముగ్గురుశాస్త్రవేత్తలతో ఒక టీం ఏర్పాటు చేయటం తెలిసిందే. తాజాగా వారు దేశ ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. జులైలో సెకండ్ వేవ్ కు తెర పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదే సమయంలో.. దేశంలో థర్డ్ వేవ్ ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యన ఉండొచ్చని తేల్చారు. కాకుంటే.. సెకండ్ వేవ్ మీదిరి అంత తీవ్రత థర్డ్ వేవ్ లో ఉండకపోవచ్చని అంచనా వేశారు. ముగ్గురు శాస్త్రవేత్తల టీంలోని సభ్యుడైన ఐఐటీ కాన్పూరు ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తాజాగా ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
ఈ నెలాఖరు నాటికి దేశంలో రోజువారీ కేసుల నమోదు సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని.. జూన్ ఆఖరకు ఇది 20వేలకు తగ్గుతుందని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ అత్యంత తీవ్ర దశకు చేరుకున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే పీక్ కు చేరిన రాష్ట్రాల విషయానికి వస్తే..
– మహారాష్ట్ర
– ఉత్తరప్రదేశ్
– కర్ణాటక
– మధ్యప్రదేశ్
– జార్ఖండ్
– రాజస్థాన్
– కేరళ
– సిక్కిం
– ఉత్తరాఖండ్
– గుజరాత్
– హర్యానా
– ఢిల్లీ
– గోవా
ఇది ఉంటే.. రానున్న పది రోజుల్లో పీక్ కు చేరుకునే రాష్ట్రా లవిషయానికి వస్తే.. తమిళనాడు.. పంజాబ్.. పుదుచ్చేరి.. అసోం.. మేఘాలయ.. త్రిపుర.. హిమాచల్ ప్రదేశ్ లు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
తాజాగా అనుసరించిన సాంకేతిక విధానం ద్వారా థర్డ్ వేవ్ కు సంబంధించి ఎప్పుడు ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం దేశంలో అక్టోబరు వరకు మూడో వేవ్ ఉండకపోవచ్చని.. ఆ తర్వాతే ఉంటుందని చెబుతున్నారు.
అయితే.. సెకండ్ వేవ్ అంత తీవ్రత మూడో వేవ్ లో ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం అప్పటికి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ జరిగి ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సెకండ్ వేవ్ తీవ్రతను అంచనా వేయలేకపోయిన విషయాన్ని ఆయన అంగీకరించటం గమనార్హం.