ఈ టెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల పసి పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలాళ్ల వరకు అరచేతిలో స్మార్ట్ ఫోన్, అపరిమిత మొబైల్ డేటా అందుబాటులో ఉంటోంది. దీంతో, నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి పడుకోబోయే వరకు కర్ణుడికి కవచకుండలాల్లా… అరచేతికి స్టార్ట్ ఫోన్ అతికించుకుంటున్నారు. ఫేస్` వాష్ చేయకపోయినా పర్లేదు కానీ….`ఫేస్` బుక్ ఓపెన్ చేయనిదే కొందరికి రోజు ప్రారంభం కాదు. ఇన్ స్టాలో ఫొటో షేరింగ్…వాట్సాప్ లో చాటింగ్ చేయకుంటే పొద్దు గడవని వారెందరో ఉన్నారు.
ఇలా ఈ సోషల్ ప్లాట్ ఫాంకు అలవాటుపడిన వారందరికి సోమవారం రాత్రి నిద్ర పట్టలేదు. తమ జీవితాలతో పెనవేసుకున్న ఈ 3 యాప్ లు సోమవారం రాత్రి 9 గంటల నుంచి స్తంభించిపోవడమే అందుకు కారణం. దీంతో, కోట్లాది మంది యూజర్లు తెగ కంగారుపడిపోయారు. తమకు మాత్రమే ఈ సమస్య వచ్చిందా…లేదంటే అందరికీ వచ్చిందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరికొందరైతే, ట్విటర్ లో ఈ వ్యవహారంపై ట్వీట్లను హోరెత్తించారు.
కొందరైతే మీమ్స్ తో ట్వీట్లు చేస్తూ సెటైర్లు వేశారు. నా పొలంలో మొలకలూ రాలేదు…నా ఫోన్ లో వాట్సాప్ పనిచేయడం లేదంటూ ఓ నెటిజన్ చేసిన మీమ్ వైరల్ అయింది. ఇక, కొందరు లవ్ బర్డ్స్ అయితే వాట్సాప్ లేకపోతే క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయంటూ తమ బాధను వెళ్లగక్కారు. ఈ మూడు యాప్ లు స్తంభించిపోవడంతో ట్విటర్, టెలిగ్రామ్, సిగ్నల్ లకు తాకిడి పెరిగింది.
అయితే, సాంకేతిక కారణాలతో తమ సేవలు నిలిచిపోయాయని, వాటిని పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు చేపట్టామని ఫేస్ బుక్ వివరణనిచ్చింది. ఈ అంతరాయంపై తమ యూజర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. అయితే, సైబర్ ఎటాక్ జరగడంతోనే ఇలా వాటి సేవలు నిలిచిపోయాయని మరికొందరు టెక్ నిపుణులు అంటున్నారు.