సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మీడియా ముందుకు వచ్చారు. వచ్చీ రావడంతో మరోసారి సొంత అన్న, వైసీపీ అదినేత జగన్‌ను కార్నర్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. గంట సేపు సాగిన ఈ ప్రెస్ మీట్లో రెండు కీలక విషయాలను షర్మిల ప్రధానంగా ప్రస్తావించారు. వీటిపై క్లారిటీ ఇచ్చారు. 1) వైసీపీకి వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధం లేదన్నారు. ఇది చాలా కీలకమైన వ్యవహారం. ఇప్పటి వరకు.. వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మతోనే.. జగన్ రాజకీయాలు చేశారు. కొన్ని పథకాలకు కూడా ఆయన పేరు పెట్టారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా షర్మిల.. వైసీపీకి.. వైఎస్సార్‌కు సంబంధం లేదన్నారు.
వైసీపీ అంటే-యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అన్న షర్మిల.. ఈ పార్టీకి వైఎస్సార్ కు ఏంటి సంబంధం ? అని ప్రశ్నించారు. అంతేకాదు.. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ మనిష ని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక్కడితో కూడా ఆగకుండా.. విధ్వంసాలు, కక్షపూరిత హత్యా రాజకీయాలు చేసిన వైసీపీతో వైఎస్‌ను అంటకట్టద్దని కూడా చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. 2) రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర మాదేనని షర్మిల తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు చేరువగా ఉందని.. వారి సమస్యలపై స్పందిస్తుందని.. వైసీపీ నాయకులకు అధికారం మాత్రమే కావాలన్నారు. ఇది కూడా వైసీపీకి ఘాటుగా తగిలే వ్యవహారమే. నిజానికి అధికారంలో ఉంటే ఒకవిధంగా.. లేకపోతే.. మరో విధంగా వ్యవహరిస్తున్నారంటూ..ఇప్పటికే జగన్‌పై విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో షర్మిల కూడా వైసీపీని కేవలం అధికారం కోసం పాకులాడే పార్టీగా ప్రొజెక్టు చేయడం గమనార్హం. దీనిపైనా వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. మరో మూడో విషయం.. వైసీపీ కూడా ఆలోచన చేయాల్సిన విషయం.. ఏంటంటే.. వైసీపీకి ఈ ఎన్నికల్లో వచ్చిన 39 శాతం ఓటు బ్యాంకు కూడా..చంద్రబాబును వద్దనుకుని విధిలేని పరిస్థితిలో వైసీపీకి వచ్చినదేనని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వైసీపీలో ఉన్నవారంతా తమ కాంగ్రెస్ వారేనని.. వైసీపీ ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదన్నారు. దీనిని కూడా వైసీపీ సీరియస్‌గా తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు 39 శాతం ఓటు బ్యాంకు తమకు వచ్చిందని జగన్ పదే పదే చెప్పారు.
ఇంత ఓటు బ్యాంకు ఉంది కాబట్టి.. నైతికంగా తామే విజయం దక్కించుకున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు షర్మిల అదే ఓటు బ్యాంకుపై కన్నేయడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ ఓటు బ్యాంకును వైసీపీకి దూరం చేయాలనే లక్ష్యంతో ఆమె అడుగులు వేస్తున్నట్టు ఆమె మాటలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. మరో ఐదు సంవత్సరాల సమయం తమకు ఉందని.. ప్రతి క్షణం కూడా ప్రజలకు చేరువగా ఉండి.. ఓటు బ్యాంకును పెంచుకుంటామని చెప్పారు. ఇది కూడా వైసీపీకి మరింత ఇబ్బందికర పరిణామ. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. వచ్చే ఐదేళ్లు చంద్రబాబు కంటే కూడా.. షర్మిలతోనే వైసీపీ పోరాటం చేయాల్సి వస్తుందన్న వాతావరణం స్పష్టంగా తేలిపోయింది.