ఏపీ సీఎం జగన్ పై విజయవాడ శివారు ప్రాంతంలో జరిగిన రాయి దాడి ఘటనకు సంబంధించి.. బాధ్యుల వివరాలు తమకు చెప్పిన వారికి రూ.2 లక్షలు కానుకగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన ఎలా ఉన్నా.. ఇది ఏపీ పోలీసు ల తీరు.. వారు నిర్వహిస్తున్న విచారణ విధానం.. ప్రస్తుతం ఏపీ పోలీసులు.. అనుసరిస్తున్న సాంకేతిక సహాయం.. వంటివి.. ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఎందుకంటే.. ఈ ఏడాది జనవరి 26నే ఏపీ పోలీసులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ నుంచి `విచారణలో తోపులు` అంటూ రివార్డులు.. అవార్డులు అందుకున్నారు.
అంతేకాదు..దేశవ్యాప్తంగా సాంకేతిక విచారణలో(అధునాతన సాంకేతికతను వినియోగించడంలో) నెంబర్ 2 స్థానాన్ని కూడా ఏపీ పోలీసులు కైవసం చేసుకున్నారు. అంటే.. విచారణకు సంబంధించిన రెండు కీలక అంశాల్లోనూ ఏపీ పోలీసులు ముందున్నారు. మరి అలాంటి వారు.. కీలకమైన ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనను ఎందుకు ఛేదించలేక పోతున్నారు? ప్రజలను ఎందుకు వేడుకుంటున్నారనేది ప్రశ్న. ఈ నేపథ్యంలోనే అసలు ఏపీ పోలీసుల శక్తి సామర్థ్యాలపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయని మాజీ డీజీపీలు, మాజీ పోలీసు అధికారులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
“రివార్డు ప్రకటించడం తప్పుకాదు. కానీ, ఇది అన్ని సందర్భాల్లోనూ కాదు. బెంగళూరులో చోటు చేసుకున్న రామేశ్వరం కేఫ్ పేలుళ్ల వంటి అత్యంత దారుణ అనుమానిత కేసుల విషయంలోనే ప్రకటిస్తారు. కానీ, వందల మంది పోలీసులు అక్కడే ఉండి.. ప్రభుత్వ అనుకూల మీడియా కెమెరాలు పదుల సంఖ్యలో ఉండి.. పోలీసులు కూడా రికార్డులు చేస్తున్న సమయంలో జరిగిన దాడి ఇది. దీని కోసం ప్రజలకు రివార్డులు ప్రకటించడం వెనుక.. పోలీసులు తమ బాద్యతలనుంచి తప్పుకొంటున్నారనే వాదన వినిపిస్తోంది“ అని ఏపీకి డీజీపీగా వ్యవహరించిన సీమ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రజల నుంచి కూడా పోలీసులపై ఒకింత వ్యతిరేక భావనే వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిపై పడిన చిన్న రాయి ఘటననే విచారణ చేయలేకపోగా.. దీనిని ప్రజలకు అప్పగించి.. రివార్డులు ప్రకటించడంపైనా వారు విస్మయం వ్యక్తం చేస్తున్నా రు. అంతేకాదు.. సీఎం స్థాయి వ్యక్తికే భద్రత ఇవ్వలేక పోతే.. రేపు ఎవరు వచ్చినా.. ఎవరు ఎవరిపై దాడులు చేసినా.. ఎవరు బాధ్యత వహిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని అంటున్నారు. ఏదేమైనా.. టెక్నాలజీలలో ముందున్నామని.. సాంకేతిక విప్లవంలో ముందున్నామని ప్రకటించే ఏపీ పోలీసులు.. సీఎం పై దాడి జరిగితే గుర్తించలేక పోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.