టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ నిర్వహించిన శంఖారావం.. సభలు ముగిశాయి. గత ఏడాది ప్రారంభించి .. ఈ ఏడాది ముగించిన యువగళం పాదయాత్ర లో కవర్ కాని ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఈ శంఖారావం సభలను నిర్వహించారు. మొత్తం 10 రోజుల పాటు నిర్విరామంగా నారా లోకేష్ ఉత్తరాంధ్రలోని విజయనగరం నుంచి విశాఖ పట్నం వరకు ఈ శంఖారావం సభల్లో పాల్గొన్నారు. మొత్తం 34 నియోజకవర్గాలకు గాను.. 31 నియోజకవర్గాలను ఆయన ఈ యాత్రల్లో కవర్ చేశారు. ఈ యాత్రలు పూర్తిగా విజయవంతం అయ్యాయనేది పార్టీ వర్గాలతోపాటు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న టాక్.
సుడిగాలి పర్యటనలతో నారా లోకేష్ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించిన ఈ శంఖారావం సభలు.. రోజులు మూడు నియోజకవర్గాల్లో కవర్ చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా.. నిర్విరామంగా నారా లోకేష్ పర్యటించారు. ప్రతి సభలోనూ సుమారుగా గంటన్నర సేపు ఆయన ప్రసంగించారు. ఇచ్ఛాపురం నుంచి పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఆయన వరుసగా తిరిగారు.
ఈ సందర్భంగా రెండు వ్యూహాలతో నారా లోకేష్ ముందుకు సాగారు. ఒకటి పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేయడం.. రెండు తన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజితులను చేయడం.
ఈ రెండు వ్యూహాలను కూడా నారా లోకేష్ సక్సెస్ ఫుల్గా నిర్వహించారనేది గ్రౌండ్ రిపోర్టు నుంచి వినిపిస్తున్న మాట. కార్యకర్తలను ప్రధానంగా ఈ దఫా ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఎన్నికల వేళ ప్రజలతో మమేకం కావల్సింది.. కార్యకర్తలే కావడం.. అయితే..వారిపైనే వైసీపీ నుంచి నిర్బంధాలు, కేసులు ఎదురవుతుండడంతో వారిలో ధైర్యం నింపేందుకు నారా లోకేష్ ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే ఎవరిపై ఎన్ని కేసులు పెట్టుకున్నా.. వాటిని టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేస్తామని వారిలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక, మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో పాడేరు, యలమంచిలి, అరకు నియోజకవర్గాలను మాత్రం మినహాయించారు. వైసీపీ నాయకులను నారా లోకేష్ అడుగడుగునా.. చీల్చి చెండాడారనే చెప్పాలి. ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలను ప్రతి జిల్లాలోనూ టార్గెట్ చేస్తూ వచ్చారు.
వారు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని చేసిన విమర్శలు.. బాగానే వైరల్ అయ్యాయి. ఇక, నియోజకవర్గాల వారీగా తీసుకుంటే.. ఆయా నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలను నారా లోకేష్ ఎండగట్టారు. నేతల అవినీతి, అక్రమాలను ప్రధానంగా వినిపించారు.ఇక, ఇదే సమయంలో సీఎం జగన్కు సవాళ్లు, ప్రతిసవాళ్లు, కుర్చీమడత పెట్టేస్తారని చేసిన వ్యాఖ్యలు, మంత్రి సీదిరి అప్పలరాజుపై చేసిన విమర్శలు.. ఇలా.. అన్ని కోణాల్లోనూ నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభలు పూర్తిగా సక్సెస్ అయ్యాయనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. మరి, లోకేష్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది.