శ్రీకాకుళం టీడీపీలో…ముఖ్యంగా గుండ వర్గీయుల్లో కలకలం రేగుతోంది. ఎప్పటి నుంచో పట్టున్న ప్రాంతం కాస్త ఇతరుల చేతిలోకి వెళ్లిపోవడం ఖాయమనే భావనే వినిపిస్తోంది. ఆ విధంగా ఇప్పుడు ధర్మాన వర్గం మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేయవచ్చు కూడా అన్న వాదన కూడా మరో వైపు స్పష్టం అవుతోంది. నిన్నమొన్నటి వేళ యువ నాయకులు గొండు శంకర్ తన అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర వెల్లడించారు.
అదేవిధంగా చాలా పై స్థాయిలో లాబీయింగ్ నడుపుతున్నారని కూడా నగర టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఈ సారి గొండు శంకర్ (మాజీ ఎంపీపీ గొండు జగపతి కుమారులు, కిష్టప్ప పేట సర్పంచ్ ) రంగంలోకి దిగనుండడం ఖాయమని కూడా తెలుస్తోంది.దీంతో నగర టీడీపీలో ఇదే విషయమై ఓ చర్చ సాగుతుందని తెలుస్తోంది. వాస్తవానికి సుదీర్ఘ కాలం శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఆ రెండు కుటుంబాలే ఏలుతున్నాయి అని ఓ విమర్శ కూడా ఉంది.
ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు కూడా అధినేత చంద్రబాబు నేతృత్వాన కొత్త ముఖాల అన్వేషణ అన్నది షురూ అయిందని తెలుస్తోంది. ఇక్కడే కాదు జిల్లాలో సగానికి పైగా సీట్లు కొత్తవారే ! అంటే టీడీపీ ఖాతాలో పోటీచేసే ముఖాలన్నీ కొత్తవే ! ఎందుకంటే గతం కన్నా భిన్నంగా పార్టీని బతికించే ప్రయత్నం చేయడంతో పాటు కొత్త ముఖాలను ప్రోత్సహించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇదే విధంగా మిగిలిన చోట్ల కూడా ఆశావహులు ఉన్నారు. కానీ వారంతా ఒక మండల స్థాయి నాయకులు కావడమే కొంత మైనస్.
ఓ నియోజకవర్గంలో రెండు నుంచి నాలుగు మండలాలు ఉంటే వాటిలో ఒక్క మండలానికే వారు నాయకులుగా ఉన్నారే తప్ప మొత్తం నియోజకవర్గంపై పట్టు లేదు.ఈ క్రమంలోనే కొందరు ఆశావహులు మిగిలిన ప్రాంతాలపై పట్టు పెంచుకునేందుకు ఇప్పటి నుంచే సోషల్ మీడియా యాక్టివిటీస్ ను పెంచారు. సంబంధిత చర్యల్లో వేగాన్ని పెంచాక, కొన్ని స్థానిక మీడియాల ద్వారా తామేంటో చెప్పేందుకు, తమ ఉనికి ఏంటో చాటేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇవన్నీ కూడా టీడీపీలో ఇవాళ వస్తున్న మార్పులు. గడిచిన మూడేళ్ల లో కన్నా ఇప్పుడే బాగా పనిచేయాలన్న తలంపుతో వీళ్లంతా చేస్తున్న మార్పులు. చేయాలనుకుంటున్న చేర్పులు కూడా ! ఆ విధంగా ఈ సారి జిల్లా టీడీపీలో మంచి పరిణామాలే రానున్నాయి. జిల్లాలో గుండ కుటుంబం ప్రాభవం తగ్గుతున్న నేపథ్యాన కొత్తగా కొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా నాగావళి కృష్ణ లాంటి స్థానిక నాయకులు కొంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
కానీ ఇప్పుడు ఆయన కూడా తన లాబీయింగ్ ను షురూ చేశారని , ఆయనతో పాటు మరో యువ నాయకులు, గతంలో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కొర్ను ప్రతాప్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ గుండ శిబిరాన్ని కలిచి వేస్తున్న పరిణామాలు. దీంతో కొంతలో కొంత అప్రమత్తమై అధినాయకత్వాన్ని కలిసి రావాలన్న ఆలోచన కూడా గుండ లక్ష్మీదేవి చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయాన లోకేశ్ కు ఇక్కడి పరిస్థితులు వివరించాలని మరికొందరు యోచిస్తున్నారు.
ధర్మాన ప్రసాదరావును వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు,లేదా మళ్లీ గుండ వారింటి నాయకత్వంను బలపరిచేందుకు యువ శక్తి ఏ మేరకు ప్రభావితం చేయనుందో చూడాలిక ! ఇదే సమయంలో గుండ వారింటి చిన్నబ్బాయి విశ్వనాథ్ రంగంలో దిగితే ఈక్వెషన్లు అన్నీ మారిపోవడం కూడా ఖాయం.
4estxg