మరణం తర్వాత ఏమిటో మిస్టరీనే. మనిషి మరణం తర్వాతేం జరుగుతుందన్న దాని మీద ఉన్న సందేహాలకు సమాధానాలు దొరకని పరిస్థితి. మనిషి చనిపోయిన తర్వాత అతడి ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుందా? అలా వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది? బయటకు వచ్చిన ఆత్మను తీసుకెళ్లటానికి ఎవరైనా వస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. అయితే.. మరణం అంచుల వరకు వెళ్లిన వారు.. కోమాలో సుదీర్ఘకాలం ఉండి మామూలు మనుషులైన వారు.. వెంటిలేటర్ల వరకు వెళ్లి.. ఆశలు వదిలేసుకున్న వారు తిరిగి మామూలు అయిన వారు.. ఒక్కమాటలో చెప్పాలంటే చావును చూసి వెనక్కి వచ్చినట్లుగా చెప్పే దాదాపు ఐదు వేల మందిపై అమెరికన్ వైద్యుడు జెఫ్రీ లాంగ్ పరిశోధనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. మరణం తర్వాత జీవితం కచ్ఛితంగా ఉందని.. అందులో ఏ మాత్రం సందేహం లేదని చెబుతున్న ఆయన.. తనకు వైద్య విద్యను అభ్యసించే సమయం నుంచి కూడా ఈ అంశంపై ఆసక్తి ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే 1998లోనే (అంటే.. దాదాపు పాతికేళ్ల క్రితమే) నియర్ డెత్ ఎక్స్ పీరియెన్స్ రిసెర్చ్ ఫౌండేషన్ (చావు దగ్గరి అనుభూతి పరిశోధనా సంస్థ)ను స్థాపించారు. తన అధ్యయనంలో భాగంగా కలిసిన వారిలో 45 శాతం మంది ఆత్మ బయటకు వచ్చి తనను తాను చూసుకోవటం.. చుట్టూ జరిగే వాటిని చూడటం.. అక్కడ ఉండే వ్యక్తుల మాటల్ని వినటం లాంటి వాటి గురించి పేర్కొన్నారు.
ఇక్కడ షాకింగ్ అంశం ఏమంటే.. అలా వారు చెప్పిన మాటలన్నీ అప్పట్లో జరిగినవేనని అక్కడి వారు ధ్రువీకరించటం చూసినప్పుడు.. మరణం తర్వాత ఆత్మ శరీరం నుంచి బయటకు వెళుతుందన్నది వాస్తవమన్న విషయం అర్థమవుతుంది. ఆ సమయంలో వారు వేరే లోకంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుందన్న విషయాన్ని పలువురు చెప్పినట్లుగా పేర్కొన్నారు.
ఒక సొరంగం నుంచి ప్రయాణించి.. చివర్లో ఒక కాంతిపుంజం కనిపించటం..తమ కంటే ముందే మరణించిన తమ ఆప్తుల్ని అక్కడ కలుసుకోవటం లాంటి అనుభవాల్ని తాము అనుభూతి చెందినట్లుగా డాక్టర్ జెఫ్రీ పేర్కొన్నారు.
ఆ టైంలో తమ జీవితం మొత్తం కళ్ల ముందు ఫ్లాష్ అయినట్లుగా ఉంటుందని కొందరు చెప్పినట్లుగా పేర్కొన్నారు. జెఫ్రీ చెప్పిన మాటల్ని వర్జినీయా వర్సిటీలో సైకియాట్రీ అండ్ న్యూరోబిహేవియరల్ సెన్సైస్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ కూడా ఏకీభవిస్తున్నట్లు చెబుతున్నారు. సో.. మరణం తర్వాత కూడా మరేదో ఉంది. ఈ భౌతిక శరీరం ఒక్కటే కాదు.. భౌతిక శరీరం గతించిన తర్వాత కూడా కొనసాగేది ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోందని కానీ.. అదేమిటో తనకు తెలీదని బ్రూస్ పేర్కొనటం గమనార్హం.