తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి జనం కష్టాలు తీర్చేందుకు నడుంబిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ .. దత్తత గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల కిందట అక్కడ పర్యటించారు. భారీ సంఖ్యలో వచ్చిన జనంతో ఆయన సహపంక్తి భోజనం చేశారు. అయితే..ఇప్పుడు ఇదే.. తీవ్ర వివాదానికి కారణం అయింది. కేసీఆర్‌తో కూర్చుని భోజనం చేసిన వారిలో 20 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సీఎం పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తయ్యాక బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు.
రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను అదే రాత్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిం చారు. ఆగమ్మ ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ రవిప్రకాశ్ తెలిపారు. ఒక బాలిక అస్వస్థతకు గురి కావటంతో ఆసుపత్రికి తరలించారు. అదే రోజు ఆ బాలికను ఇంటికి పంపారు. గ్రామంలో మరో 16 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది.
ఇంటింటా తిరిగి అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యాధికారి సీహెచ్.చంద్రారెడ్డి తెలిపారు. వారి అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని, సహపంక్తి భోజనంలో 2500 మంది పాల్గొనగా. 20 మంది మాత్రమే అనారోగ్యానికి గురైనట్లు పేర్కొన్నారు. తీసుకున్న ఆహారం పడక వాంతులు, విరేచనాలై ఉంటాయని చెప్పారు.
అయితే.. ఈ ఘటనకు సంబంధించి అప్పుడే విమర్శలు వస్తున్నాయి. కరోనా సమయంలో కేసీఆర్ ఇలా సహపంక్తి భోజనం చేయడం ద్వారా.. రాజకీయంగా మార్కుల కోసం తహతహలాడారని.. ఇది మంచి పద్ధతి కాదని.. కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సైలెంట్‌గా వైద్యులను రంగంలోకి దింపి.. పరిస్థితి చేయి దాటిపోకుండా చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా.. ముదురుతుందా? చూడాలి.