సంఘం అంటే పదిమంది కల్సి ఐక్యతతో ఒక సమూహంగా మారి అందరి పురోభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించుకోవడం. స్వాతంత్రానికి ముందు సమాజంలో పేరుకు పోయిన కుల,మత వైషమ్యాలు, ఒక వర్గం ఆధిపత్యాన్ని ప్రశ్నించి తమ సంఘ అభివృద్ధితో పాటుగా యావత్ సమాజ అభివృద్ధి కోసం ఏర్పడినవే కమ్మ సంఘాలు. మరీ ముఖ్యంగా విద్యపై బ్రాహ్మణ వర్గం ఆధిపత్యాన్ని ప్రశ్నించి, ప్రతీ ఒక్కరికీ విద్య అందాలని సమాజంలో మొదట అడుగు వేసింది ఈ సంఘాలే. కమ్మకులానికి చెందిన తొలి మహాసభ 1910లో కృష్ణా జిల్లా కౌతారంలో జరిగింది. కంఠంనేని వెంకట రంగయ్య, బొబ్బా పద్మనాభయ్య అందులో ప్రధాన పాత్ర పోషించారు. నాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం క్రమ పద్ధతిలో విజయవాడ, గుంటూరు, ఖమ్మం వంటి చోట్ల హాస్టళ్లు పెట్టారు. తరువాత ఏటేటా కాకున్నా వీలున్నపుడల్లా సభలు జరుపుకుని సంఘ పురోభివృద్ధికి తగిన చర్చలు చేశారు.
ఆచార్య ఎన్. జి.రంగా, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి మహోన్నతుల బాటలో నాటి కమ్మ సంఘం నేతలు పయనించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి వంటి వారి పోరాటాలను ఆదర్శంగా తీసుకున్నారు. తమ సమూహంలో విద్యాభివృద్ధి కోసం హాస్టళ్లు తెరిచారు. పాఠశాలలు,కళాశాలలు స్థాపించారు. ఆఖరికి వేద విద్య అనేది ఒక్క వర్గానికి మాత్రమే కాదని తమకూ హక్కు ఉందని నినదిస్తూ వేదం నేర్చుకున్నారు. అందులో సారాన్ని ఇముడ్చుకుని సాధువులయినవారు (పండిత గోపదేవ్ వంటివారు) కొందరైతే, వాటిలో లోపాలను ఎత్తి చూపి హేతువాదంతో ముందుకు వెళ్ళింది(త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు) మరికొందరు. సూర్యదేవర రాఘవయ్య చౌదరి 1925లో బ్రహ్మణేతర సంఘ దర్శనము, బ్రాహ్మణేతర విజయం అనే గ్రంథాలు నాడు బ్రాహ్మణేతర కులాల వారందరికీ మార్గదర్శకాలై వెలుగులీనాయి. 1912లో సాంఘిక న్యాయం కోసం బ్రాహ్మణేతర వర్గాల వారికి నాటి ప్రభుత్వ అవకాశాల్లో స్థానం కల్పించాలని బ్రిటీష్ వారు తలపోశారు. అయితే చదువుకున్న వారు ఉండాలిగా. ఈ అంశాన్ని బేరీజు వేసుకుని కమ్మవారు విద్యపై అధికంగా దృష్టి సారించారు. పురుషులు చదువుకోవడమే గగనం అనుకుంటున్న సమయంలో బాలికలకు కూడా విద్యను అందించడం మొదలుపెట్టారు.
ఏది ఏమైనా నాడు కమ్మవారు విద్యాభివృద్ధికి వేసిన బాటలు ఒక్క వారి సంఘీయులకే కాక యావత్ సమాజానికి ఉపయోగపడ్డాయి.
ఆత్మాభిమానాన్ని ప్రదర్శించడంలో, ఆత్మగౌరవం చాటడంలో వారికి సాటి లేరని పేరు తెచ్చుకున్నారు. కమ్మవారు వేదాలు చదువకూడదని నాడు అగ్రహరీకులు చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తాడిపర్రులో వేద పాఠశాల ఏర్పాటు చేసుకుని వేదాలు చదివారు. 1926లో బెజవాడలో జరిగిన కమ్మ మహాసభలో ఎన్. జి.రంగా, గొట్టిపాటి బ్రహ్మయ్య పాల్గొన్నారు. 1937లో మద్రాసు రాష్ట్రానికి ప్రధానిగా చేసిన బొల్లిని మునుస్వామి నాయుడు కమ్మవారే. అయితే స్వాతంత్రానంతరం ఈ చర్యలన్నీ కమ్మ వారి రాజకీయ పురోభివృద్ధికి ఆటంకం కల్గించాయి.
రాజకీయ రంగంలో అత్యున్నత పదవులు సాధించకుండా, అప్పటి కేంద్ర పార్టీ వద్ద లాబీయింగ్ ల ద్వారా రెండు మూడు కులాల వారు కమ్మవారిని అడ్డుకున్నారు. అయినా వారు నిరాశ చెందలేదు. పారిశ్రామిక, సినీ,వ్యవసాయ,విద్యా రంగాల్లో తమదైన శైలిలో దూసుకుపోయారు. కమ్మవారిని ఎక్కువగా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు. కమ్మవారు ఆయా రంగాల్లో చేసిన కృషి 80వ దశకంలో కమ్మ వర్గానికి చెందిన ఎన్. టి.రామారావు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తోడ్పడింది. అయితే ఈ క్రమంలో వారిపై కుల ముద్ర ఎక్కువగా పడటం జరిగింది. కులాభిమానం ప్రదర్శించడం వల్ల కమ్మ వారిపై పడిన కులముద్ర కన్నా ప్రత్యర్ధులు పద్ధతి ప్రకారం వారిపై చేసిన వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం వల్ల కమ్మవారిపై పడిన కులముద్రే అధికం. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సమాజంలో వీరి ప్రాభవం తగ్గడం మొదలుపెట్టిందనే చెప్పాలి. ఎక్కడ తనపై కులముద్ర పడుతుందో అని భయపడే చంద్రబాబు వీరిని దూరంగా పెట్టినా ప్రత్యర్ధులు చంద్రబాబును ఎదుర్కోవడానికి అతనిపై కులముద్ర వెయ్యడం విశేషం. తరువాత తెలంగాణ ఆంధ్ర విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో కమ్మవారి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ప్రత్యర్థి పార్టీ వ్యూహాత్మకంగా సోషల్ మీడియా ద్వారా చేసిన దుష్ప్రచారం ఖండించడంలో కమ్మ సంఘాలు విఫలం అయ్యాయి. స్వయానా తమ వర్గానికి చెందిన వ్యక్తుల మీడియా సంస్థలే తమపై నిందలు వేస్తుంటే చోద్యం చూసాయి. దానితో ఎవరు ఏమన్నా కమ్మవారు పడి ఉంటారనే భావన సమాజంలో ప్రబలింది.
తాజాగా కమ్మ కులానికి సంబంధించిన రెండు పరిణామాలు ఆ కులం యువతను ఆలోచింప జెయ్యడం విశేషం.
1.కృష్ణా జిల్లాకు చెందిన జాస్తి హరిత అనే అమ్మాయి చదువుకోవాలనే ఆశ ఉన్నా తన తల్లిదండ్రుల పేదరికంతో వారికి భారం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకోవడం.
2. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో సర్క్యులేట్ తరువాత మీడియా సమావేశంలో కమ్మ కులాన్ని పేరెత్తి నిందించడం.మొదటి విషయానికి వస్తే స్వాతంత్రానికి పూర్వమే విద్య ప్రాముఖ్యత గ్రహించి సమాజంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన కులానికి చెందిన అమ్మాయి చదువుకోవడానికి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకోవడం ఈ కులం వాళ్ళు పురోభివృద్ధి సాధించలేదు అనడానికి నిదర్శనమైతే, ఆ అమ్మాయి ఆత్మహత్య తరువాత అయినా ఏ కమ్మసంఘం ప్రతినిధి కూడా అమ్మా చదువు కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము చదివిస్తాం అనే పిలుపునివ్వకపోవడం. కంఠంనేని వెంకట రంగయ్య, బొబ్బా పద్మనాభయ్య గార్లు బతికుంటే వారు ఈ విధంగానే చేసేవారు కదా.
త్రిపురనేని బతికుంటే ఈ సంఘాల అధ్యక్షులను పిలిచి మాటలతోనే చావగొట్టేవారు కదా. ఇదే ఆలోచన నేడు కమ్మ యువతలో ఆవేదనను రగిలిస్తోంది.
ఇక రెండవ అంశానికి వస్తే గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినలా, డూప్లికేటా అనేది పక్కన పెడితే ఆయన దాన్ని కమ్మ కులానికి అపాదించడం ఏమేరకు సమంజసం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాగంగా ఏర్పడిన ఈ పరిణామంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, ఖండంతరాల్లో వ్యాపించి ఉన్న కమ్మ వారినందరిని కలుపుకుని సదరు ఎంపీ వ్యాఖ్యలు చెయ్యడం సరికాదని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అయితే ఆయన వ్యాఖ్యల తరువాత తెలంగాణా కమ్మ సంఘాల ప్రతినిధులు పెట్టిన ప్రెస్ మీట్ లో ఒకాయన మాట్లాడుతూ ఇప్పటికే ఆలస్యం చేశామని, ఇంతకు ముందే ఒక ముఖ్యమంత్రి తమ కులాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఉండాల్సింది అనడం గమనార్హం. ఇప్పుడు కమ్మ యువత కూడా ఆయా సంఘాల నేతలను ప్రశ్నిస్తున్నది అదే.
టీవీ9లో కమ్మ కులం సాంగ్ పై కథనం వచ్చినప్పుడే ఈ కులసంఘాలు ప్రెస్ మీట్ పెట్టి యూట్యూబ్ లో అనేక కులాల పేరుతో కులకీర్తనలు ఉండగా ఒక్క కమ్మసాంగ్ పై మాత్రమే చర్చ ఎందుకు పెట్టావు అని ప్రశ్నించి ఉండాల్సి0ది. ఎవడో ట్విట్టర్ లో కమ్మ బ్లడ్ మాత్రమే కావాలని ఫేక్ ట్వీట్ పెడితే వెంటనే వాళ్లపై కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిoది. ఒక పార్టీ సోషల్ మీడియా కమ్మ కులానికి వ్యతిరేకంగా లేని,పోని కథనాలు వండి వార్చుతుంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీకు మా సామాజిక వర్గం ఓట్లు అవసరం లేదా? మీకు తెలుగుదేశం పార్టీకి ఏమైనా రాజకీయాలు ఉంటే మీరు, మీరు తేల్చుకొండి మా కులంపై దుష్ప్రచారం చెయ్యకండి అని గట్టిగా నినదించాల్సిoది. ముఖ్యమంత్రి, స్పీకర్ వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ కులాన్ని నిందిస్తుంటే కనీసం నిరసన తెలపాల్సిoది. కోర్టులను ఆశ్రయించయినా వారు చేసిన తప్పును ఎత్తి చూపాల్సిoది.
ఇవేవీ చెయ్యకపోవడం కమ్మ కుల సంఘాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవడం ఆయా కుల సంఘాల నాయకత్వానికి అత్యవసరం. కులంపై దాడిని అడ్డుకోకుంటే ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉన్నవాళ్లు భావి తరాల దృష్టిలో చేతకానివారుగా మిగిలిపోతారు. ఎవరో తమ రాజకీయ ప్రయోజనాలకు తమ కులం ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంపై దాడి చేస్తుంటే కనీసం ఎదిరించక, ఎదుర్కోలేక నిద్ర నటిస్తున్న కుంభకర్ణుల్లా వీరు కూడా మిగిలిపోతారు