వైసీపీ హయాంలో అదుపు తప్పి మాట్లాడిన.. ప్రవర్తించిన నేతల్లో ఒక్కొక్కరుగా అరెస్టవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆ జాబితాలో చేరారు. వైసీపీలో చేరిన మొదట్లో ఆయన మాట కొంచెం అదుపులోనే ఉండేది. కానీ తర్వాత ఆయన శ్రుతి మించిపోయారు. రాయలేని భాషలో తెలుగుదేశం, జనసేన ముఖ్య నేతల్ని దారుణమైన బూతులు తిట్టి వార్తల్లో నిలిచారు.
ఫలితంగా వైసీపీ ప్రభుత్వంలో పదవి కూడా సంపాదించారు. కానీ నాటి తప్పులకు ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న డ్రామా గురించి తెలిసిందే. ఇక పోలీసుల విచారణలో పోసాని ఏం మాట్లాడాడు.. అక్కడ ఆయన్ని పోలీసులు ఏం ప్రశ్నలు అడిగారు అన్నది మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రధాన పత్రిక రిపోర్ట్ ప్రకారం.. పోలీసులకు, పోసానికి మధ్య సంభాషణ ఎలా సాగిందంటే..?
గురువారం పోసానిని పోలీసులు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముందు ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తు లేదు అని సమాధానాలు ఇచ్చిన ఆయన.. గతంలో దారుణమైన బూతులు మాట్లాడిన వీడియోలను తన ముందు పెట్టేసరికి మౌనం వహించారట. ఇవి చట్ట విరుద్ధం కాదా అని అడిగితే.. ‘‘మీరు చూపించిన మాటలన్నీ నావే. నేను తప్పు చేశాను. అలా మాట్లాడి ఉండి కూడదు.
ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నా. ఇంతకంటే నేను చేసేది, చెప్పేది లేదు’’ అన్నారట. తాను చెప్పుడు మాటలు విని తప్పు చేశానని పోసాని అన్నారట. ఒక దశలో ఏం అడిగినా.. ‘లవ్యూ రాజా’ అంటూ సమాధానం దాటవేసిన ఆయన.. చివరికి పోలీసుల దారిలోకి వచ్చారట. పవన్ కళ్యాణ్, లోకేష్‌లను వ్యక్తిగతంగా తిట్టమని ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగితే పోసాని మౌనం వహించారట. తన వ్యాఖ్యలు ఇంత వరకు తనను తీసుకొస్తాయని తెలియన తప్పు చేశానని ఆయన అన్నారట. ఈ వ్యాఖ్యలకు ప్రతిఫలంగానే మీకు పదవి వచ్చిందా అని అడిగితే.. మౌనమే ఆయన సమాధానం అయ్యిందట.