శక్తిమంతమైన మహిళలు సమాజానికి కర దీపికలు. అలాంటి అతివలు ఏదో సాధారణంగా పుట్టుకు రారు. వాళ్లు జీవితంలో ఎన్నో సవాళ్లను దాటి శక్తిగా ఎదుగుతున్నారు. ప్రతి అడ్డంకిని దాటుకుంటూ మానసికంగా, శారీరకంగా వృద్ధి చెందుతూ తల పైకెత్తి, ఎవరూ అడ్డుకోలేని బలాన్ని చాటుతూ ముందుకు సాగుతున్నారు. కష్టాల సునామీని దాటుకుని సగర్వంగా నిలబడ్డ ఆడవాళ్లు నిజమైన యోధులు. మహిళలను బలవంతులుగా తీర్చదిద్దడమే ఫెమినిజం కాదు. వాళ్లు అప్పటికే దృఢంగా ఉంటారు. వాళ్ల సామర్థ్యాన్ని ప్రపంచం ఏ విధంగా గ్రహిస్తుందనే మార్గాన్ని మార్చడమే ఫెమినిజం. కలిసికట్టుగా ఎదుగుదాం.. కలిసికట్టుగా అభివృద్ధి సాధిద్దాం.. ఇవీ ఇటీవల మహిళల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మహిళా సాధికారత తెలుగు సంస్థ (వేటా) చెబుతున్న మాటలు. వర్చువల్‌గా జరిగిన ఈ ఈవెంట్లో వివిధ రంగాల నుంచి మహిళా ప్రముఖులు పాల్గొన్నారు.
మహిళల కోసం పని చేస్తున్న అమెరికా సంస్థ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఘనంగా ఈ వర్చువల్ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మార్చి 26న నిర్వహించింది. ఒకరి చేతులు మరొకరం పట్టుకుని పైకి ఎగురుదాం అంటూ మిత్రత్వం, సహకారం అవసరాన్ని వేటా గుర్తు చేస్తోంది. కలిసి సాగే అలలు పడవలను పైకి లేపినట్లుగా మహిళలు కూడా ఒక్కటిగా సాగాలంటూ స్ఫూర్తి నింపుతోంది. సంస్కృతి, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో తెలుగు మహిళలు సాధించిన విజయాలను ఈ కార్యక్రమంలో సెలబ్రేట్ చేసుకున్నారు. 22 మందితో కూడా తమ బృందం సమాజంలో అవసరాల్లో ఉన్న ఆడవాళ్లకు వివిధ మార్గాల్లో సాయం చేస్తుందని వేటా తెలిపింది. 2018లో వేటాను ప్రకటించగా.. 2019లో దాన్ని ప్రారంభించారు. తోటి ఆడవాళ్ల సాధికారత కోసం ఇతర మహిళలు ముందుకు వచ్చేందుకు వేదికగా దీన్ని ఆరంభించారు.
మూడు గంటల పాటు సాగిన ఈ వర్చువల్ మహిళల దినోత్సవ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన అతివలను సత్కరించి గౌరవించారు. డీకే అరుణ (రాజకీయాలు), సుధ (సామాజిక సేవ), డాక్టర్ అంబటి శ్రీవాణి (వైద్యం), ప్రశాంతి రెడ్డి (అటార్నీ), నైనా జైస్వాల్ (క్రీడలు), బాలభద్రపాత్రుని రమణి (సాహిత్యం)లను సన్మానించారు. అనంతరం దివంగత గాయని లతా మంగేష్కర్‌కు పాటలతో నివాళులర్పించారు. సింగర్లు రియా, రేలారే రేలా ఫేమ్ గంగ పాటలతో ఆకట్టుకున్నారు. భావన, మాధురి కూచిపుడి నృత్య ప్రదర్శనతో కట్టిపడేశారు. ఎమినెంట్ డ్యాన్స్ స్కూల్ ఎరో డ్యాన్స్ వాళ్లు ఫ్యూజన్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. స్వాతి రెడ్డి, తేజస్వి సినిమా మెలోడీ పాటలతో హాయినందించారు. వేటా టీమ్ సభ్యులు ఫ్యాషన్ షోలో ర్యాంపుపై హొయళొలికారు. వివక్షను బద్దలు కొట్టండి అనే థీమ్‌తో సాగిన ఈ కార్యక్రమం ఆద్యాంతం ఉర్రూతలూగించింది.
బాలికలు, మహిళల సంక్షేమం, శ్రేయస్సు కోసం వేటా పనిచేస్తోంది. బాలికలు, మహిళలు, పెద్దవాళ్ల ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం పాటు పడుతోంది. ఆర్థికంగా వెనకబడ్డ కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ల కనీస అవసరాలు తీర్చుకునేలా తోడ్పాటు అందిస్తోంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ప్రొఫెషనల్‌గా తమ నైపుణ్యాలకు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆత్మవిశ్వాసంతో సమాజాన్ని ఎదుర్కొనేలా వాళ్లను తీర్చదిద్దుతోంది. సామాజిక కట్టుబాట్లు అనే భయాలను దాటి మహిళలు వాళ్ల కలలను అందుకునేలా ప్రోత్సహిస్తోంది. బాలికలు, యువతులు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా స్థానిక అధికారులతో కలిసి విధానాలు, పథకాలు అమలు చేయడంలో తోడ్పాటు అందిస్తోంది.