తెలంగాణలో టీడీపీ బలోపేతంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఖమ్మం లో నేడు జరగనున్న సభకు ఆయన బయలుదేరారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు భారీగా టీడీపీ నేతలు చంద్రబాబు వెంట తరలి వెళ్లారు. రసూల్‌పుర వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఖమ్మం బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా తెలుగు తమ్ముళ్ళు పూలు చల్లి, గజ మాలలతో స్వాగతం పలుకుతున్నారు. ఎనిమిదిన్నరేళ్ళ తర్వాత తెలంగాణలో మెదటసారి బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటుండడంతో ఖమ్మం మొత్తం పసుపుమయమైంది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సభకు లక్షమంది వస్తారన్న అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ఎల్బీనగర్, హయతనగర్, చౌటుప్పల్ మీదుగా ఖమ్మం వెళ్లి ఆ తర్వాత సర్దార్‌పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. సభ ముగిసిన తర్వాత బోనకల్ మండలం మీదుగా విజయవాడ వెళ్లనున్నారు
మరోవైపు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీ నేత షేక్ ఇబ్రహీం హత్యపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీం హత్య అత్యంత కిరాతకమని, పల్నాడులో శాంతి భద్రతల దుస్థితికి ఈ హత్య నిదర్శనమని మండిపడ్డారు. పల్నాడును జగన్ ఏం చేయాలనుకుంటున్నారోనని విమర్శించారు. ఇబ్రహీం హత్యపై జవాబు చెప్పాలని జగన్ ను నిలదీశారు. పల్నాడు జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
నరసరావుపేటలో మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న షేక్ ఇబ్రహీంను పట్టపగలు, అందరూ చూస్తుండగానే హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకు పరాకాష్ఠ అని నారా లోకేష్ మండిపడ్డారు. ఇబ్రహీం హత్య ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ స్పాన్సర్డ్ మర్డరేనని ఆయన ఆరోపించారు.