దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ల వ్యవస్థను ఏపీలో రూపకల్పన చేశామని సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ వలంటీర్ల సేవలు అద్భుతమని, వారు ఉండడం వల్లే కరోనా కట్టడి సాధ్యమైందని వైసీపీ నేతలు చెబుతుంటారు. అయితే, వలంటీర్లు తమ విధులు సరిగా నిర్వహించడం లేదని, వైసీపీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సొంత ఇలాకాలో ఓ వార్డు వలంటీర్ చేసిన పని చర్చనీయాంశమైంది. ప్రజలకు సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయాల్సిన వలంటీరు…పాస్టర్ అవతారమెత్తిన వైనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సంక్షేమ పథకాలు తెలియజెప్పేందుకు క్రియేట్ చేసిన వలంటీరు వాట్సాప్ గ్రూపులో 21వ వార్డు వలంటీరు మత ప్రచారానికి సంబంధించిన పోస్టులు పెట్టడం కలకలం రేపింది.
సీఎం జగన్ సొంత జిల్లా కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ వార్డు గ్రూపులో ఈ మత ప్రచార పోస్టులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మత ప్రచారంపై గ్రూపు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమ సంక్షేమ పథకాలు ఆపేస్తారేమోనని భయపడుతున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువైందని, ఏపీలో క్రిస్టియానిటీ పెరుగుతోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజా వ్యవహారం చర్చనీయాంశమైంది.