పరిషత్ ఎన్నికల్లో భారీ విజయం వైసీపీలో ఎంత ఊపు తెచ్చిందో ఏమో కానీ వర్గ పోరును మాత్రం మరింత పెంచేసింది.
అనేక నియోజకవర్గాలలో ఇప్పటికే ఎంపీపీ పదవుల కోసం నేతల మధ్య కొట్లాటలు మొదలైపోయాయి. ఎవరికివారు తమ వారికి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుండడమే కాకుండా ఎవరూ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
దీనికి తోడు ఈ పరిషత్ ఫలితాలకు ముందు నుంచే కొన్ని నియోజకవర్గాలలో నేతల మధ్య పోరు తీవ్రంగా ఉంది.
దానికి తాజా పరిషత్ ఫలితాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. తమ అనుచరులనే ఎంపీపీలను చేయాలని, జడ్పీ చైర్మన్లను చేయాలని నాయకులు ఆరాటపడుతుండడంతో నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వర్గపోరాటాలలో బిజీగా ఉన్నారు.
తాజాగా ఇలాంటిదే ఒక పంచాయితీ ఏకంగా సీఎం జగన్ వరకు చేరింది. దాంతో ఆ గొడవలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరికీ జగన్ తలంటారని వైసీపీలో టాక్.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి వర్గాల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.
దర్శి నియోజకవర్గం ముండ్లమూరు ఎంపీపీ ఎన్నిక విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో సీఎం క్యాంపు ఆఫీస్‌కు దర్శి నియోజకవర్గ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
తమ వర్గానికి చెందిన వారినే ఎంపీపీగా ఎంపిక చేయాలని రెండు వర్గాలు పట్టుబడుతున్నాయి.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా సీఎంను ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కలిశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇరువురి మధ్య సయోధ్య కుదర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎంపీపీగా ఎవరిని నియమించాలో పార్టీ నిర్ణయిస్తుందని జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ హామీతో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా విజయనగరం శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు నెలకొంది.
రీసెంటుగా అక్కడి ఒక వర్గం మరో వర్గంపై ఆరోపణలు చేస్తూ స్థానిక కూడలిలో ఏఖంగా ఆందోళనకు దిగింది.
కష్టపడి పని చేసే కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు లేదని నిరసన చేపట్టింది.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య వివాదం ఇప్పటికే రచ్చగా మారింది. ఒకరిపై మరొకరు మీడియా ముఖంగా విమర్శించుకుంటున్నారు.
తనపై ఎమ్మెల్యే జక్కంపూడి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందిస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సెల్ఫీలు తీసుకున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, రాజమండ్రిలో జరిగిన కాపు సమావేశంలో ఆయన తన పక్కన కూర్చొని మాట్లాడారని చెప్పారు.
బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేశ్‌తో కుమ్మక్కై తాను రాజకీయాలు చేస్తున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కాగా టీడీపీ నేతలతో కుమ్మక్కై తనపై భరత్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని జక్కంపూడి రాజా అంతకుముందు ఆరోపించారు. పార్టీకి నష్టం చేసేవారిని, కేసులు ఉన్న వారిని తాము దూరం పెడితే… మళ్లీ వారిని తీసుకొచ్చి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. భరత్ వల్ల పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతోందని అన్నారు.
మొత్తానికి 13 జిల్లాల్లోనూ తమ నాయకుల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉందని వైసీపీ నేతల నుంచే వినిపిస్తోంది.