ఏపీ ప్రభుత్వం, పోలీసులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మహిళా పోలీసుకు అవమానం జరిగితే పోలీసు అసోసియేషన్ స్పందించలేదని, ఇసుక అక్రమ రవాణాలో పోలీసులకు వాటా ఉందా అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇసుక రవాణాపై అధికారులు, పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తామే తోలుకుంటామని జగన్ సర్కారును జేసీ హెచ్చరించారు. తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ప్రభుత్వంపై, పోలీసులపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో షాపులను కేతిరెడ్డి మనుషులకు ఇచ్చారని ,టీడీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ రాబర్ట్ ను వైసీపీలో చేర్చుకొని మున్సిపల్ స్థలంలో బిర్యానీ సెంటర్ పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ స్థలాన్ని పోలీస్ స్టేషన్ కోసం తీసుకున్నారని, అక్కడ స్టేషన్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
ఎమ్మెల్యే చెప్పినట్టే జిల్లా ఎస్పీ చేస్తున్నారని, తన మాటలు ఆయనను బాధపెట్టొచ్చని అన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రి కోసం ప్రాణమిస్తానని, తాడిపత్రి డెవలప్ మెంట్ కోసం రూ. 100 కోట్లు ఇస్తే మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబును సీఎం చేసేందుకు ఎవరి కాళ్లైనా పట్టుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా పర్లేదని, చంద్రబాబు సీఎం అయితే అంతే చాలని అన్నారు.