రాబోయే ఎన్నికల్లో పార్టీకి సంబంధించి మిగిలిన జిల్లాల పరిస్థితి పక్కన పెట్టేస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం బావా-మరుదులే జగన్ కొంపముంచేట్లున్నారు. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. దీంతో ఎంఎల్ఏలు, నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇదంతా ఎవరిగురించంటే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి గురించే.
ఇద్దరు పార్టీ పటిష్టత కోసమే పనిచేస్తున్నట్లు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులుగా ఉన్నట్లు కనిపిస్తుంటారు. కానీ లోలోపల మాత్రం ఒకళ్ళని మరొకళ్ళు దెబ్బకొట్టుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. వీళ్ళమధ్య ఆధిపత్య గొడవల కారణంగా పార్టీ దెబ్బతినేస్తోంది.
కళ్ళముందే జిల్లాలో వీళ్ళ ఆధిపత్య గొడవలు పెరిగిపోతున్నా జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధంకావటంలేదు. వీళ్ళిద్దరు స్వయంగా బావ, బావమరుదులే. అయినా రాజకీయాల్లో తండ్రి, కొడుకులు, అన్నదమ్ముల మధ్యే పడనపుడు ఇక బావ, మరుదులు ప్రత్యర్దులవ్వటంలో ఆశ్చర్యమేముంది. తాజాగా తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా బాలినేని రాజీనామా చేయటం కలకలం రేగుతోంది.
ఇద్దరు కూడా తనకు అత్యంత సన్నిహితులు కావటమే జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. 2014 ఎన్నికల్లో ఒంగోలులో బాలినేని ఎంఎల్ఏగా ఓడిపోగా, వైవీ ఎంపీగా గెలిచారు. తన ఓటమికి వైవీనే కారణమని బాలినేనిలో గట్టి అనుమానం. అప్పటికే అంతంతమాత్రంగా ఉండే సంబంధాలు పూర్తిగా దెబ్బతినేశాయి. దాంతో పనిగట్టుకుని 2019 ఎన్నికల్లో వైవీకి అసలు టిక్కెట్టే రానీయకుండా చేశారు. టీడీపీలోని మాగుంట శ్రీనివాసులరెడ్డిని బాలినేని తీసుకొచ్చి ఎంపీగా ఇప్పించారు. దాంతో వైవీ అలిగి కొంతకాలం అమెరికాకు వెళిపోయారు. తర్వాత జగన్ బుజ్జగించటంతో తిరిగొచ్చారు.
పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా పంపిస్తానని చెప్పినా వైవీ వద్దన్నారట. దాంతో ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉంచేందుకే టీటీడీ ఛైర్మన్ గా నియమించారు. 2024 ఎన్నికల్లో ఎంపీ టికెట్ తీసుకోవటమే టార్గెట్ గా వైవీ పావులు కదుపుతున్నారు. వైవీకి టికెట్ రానీయకూడదని బాలినేని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో వీళ్ళద్దరి మధ్య ఆధిపత్య గొడవలు పెరిగిపోతున్నాయి. దాని ప్రభావం వల్లే బాలినేని తన పదవులకు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. చూస్తుంటే వీళ్ళిద్దరే జిల్లాలో పార్టీ కొంపముంచేట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాల్సిందే.