ప్రత్యేక హోదా, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరు చేసిన చిరు వ్యాఖ్యలు ఆయనకు భారీ స్థాయిలో డ్యామేజి కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆల్రెడీ చిరంజీవిపై వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగిందని, హోదా అంశాన్ని చట్టంలో పొందుపరచడంలో కాంగ్రెస్ విఫలమైతే చిరంజీవి ఏం చేస్తున్నారని పేర్ని నాని వంటి నేతలు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో ఆనాడు చిరంజీవి ఏం చేశారు అన్న విషయంపై ఆనాడు చిరంజీవితో పాటు సహ ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. చిరంజీవి కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడారని, అలా మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందని ఉండవల్లి గుర్తు చేసుకున్నారు. సినిమా పరిశ్రమ పిచ్చుకేమోగానీ, చిరంజీవి మాత్రం కాదని ఉండవల్లి అన్నారు, స్వయంగా మంత్రి హోదాలో ఉండి సొంత పార్టీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడం సాధారణ విషయం కాదని కితాబిచ్చారు. అలా పోరాడిన చిరంజీవి..హోదా కోసం ఏపీ మంత్రులు పోరాడాలని సలహా ఇవ్వడంలో తప్పేమీ లేదన్నారు.
ఇక, ధాన్యం ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ అగ్రస్థానంలో, ఉందని వాస్తవానికి టిడిపి హయాంలో కంటే వైసీపీ హయాంలోనే 18 శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయని ఉండవల్లి చెప్పారు. ప్రభుత్వాలు మారినా పోలవరం ముందుకు సాగడం లేదని, టిడిపి, వైసీపీ కాకుండా మరో ప్రభుత్వం వస్తే అది పూర్తవుతుందేమోనని అన్నారు. పత్రిక, ఛానెళ్లను అడ్డుపెట్టుకొని రామోజీరావు అవకతవకులకు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాలకు కళాంజలి కళాకృతులు అని కేంద్ర ప్రభుత్వ చర్యలను పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ పై కేసు పెట్టారని , రామోజీపై పోరాడు లేకే ఏబికే ఫైన్ కట్టి బయటపడ్డారని గుర్తు చేసుకున్నారు. తనకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టే మార్గదర్శిపై పోరాటం చేయగలుగుతున్నానని, డబ్బుంటేనే కోర్టులో న్యాయం జరుగుతుందని, లాయర్ ఫీజులు అవి చెల్లించగలమని ఆవేదన వ్యక్తం చేశారు.