మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును, శైలజా కిరణ్ ను ఏపీ సిఐడి అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. దాంతోపాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించిన 30 మంది మేనేజర్లకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, రామాజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయనను గంటల తరబడి విచారణ జరిపిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.
మార్గదర్శి సంస్థలో ఆడిటింగ్ నిర్వహించడంపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్గదర్శి సంస్థలో ఆడిటర్ నియామకం, ఆడిటింగ్ తదుపరి చర్యలపై, ఆడిట్ కోసం రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, ఏపీ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దిష్ట చిట్, చిట్ గ్రూప్ ప్రస్తావించకుండా ఆడిటింగ్ కు ఆదేశించడం చట్టసమ్మతం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
జ్యూరిస్టిడిక్షన్ లేకపోయినా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆడిటర్ను నియమించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్కు ఇలా ఆడిట్ కు ఆదేశించే అధికారం లేదని అభిప్రాయపడ్డ హైకోర్టు…ఈ కేసు తదుపరి విచారణ జూన్ 19కి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లికి షాక్ తగిలినట్లయింది. ఈ క్రమంలోనే ఉండవల్లికి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఈ నేపథ్యంలోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై చర్చించేందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ కు టిడిపి నేత, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఆ సవాలును స్వీకరిస్తున్నట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. టీవీ5 తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రముఖ అనలిస్టు మూర్తి నిర్వహించే లైవ్ షోలో తాను పాల్గొంటానని ఉండవల్లి స్వయంగా మూర్తికి ఫోన్ చేసి చెప్పారు. జీవీ రెడ్డితో చర్చకు తేదీ, సమయం వేదిక త్వరలోనే ఇస్తామని అన్నారు.