ఏపీలోని వైసీపీ సర్కారుపై నిరంతరం పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన ఆయుధాలకు మరిం త పదును పెట్టింది. ఇప్పటి వరకు ఎక్కడ వేదిక లభించినా.. దానిని సద్వినియోగం చేసుకుని ముందు కు సాగిన పార్టీ అధినేత చంద్రబాబు .. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. పార్టీ నేతలను అదిలించారు. కదిలించారు. తాను కూడా ప్రజాక్షేత్రంలో కలియ దిరుగుతున్నారు.
అయితే.. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు జాతీయస్థాయిలోనూ వైసీపీని ఏకాకిని చేయడం, జాతీయ పార్టీలు.. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతల ముందు కూడా వైసీపీ అరాచకాలను బట్టబయలు చేయడం లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈ నెల 20(గురువారం) నుంచి పార్లమెంటు వర్షాకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలను కూడా వేదికలుగా మలుచుకుని.. వైసీపీని ఏకేయాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
“నాలుగేళ్లలో వైసీపీ సాధించింది ఏమీ లేదు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన ప్రభుత్వం.. అప్పులు చేయడంతోనే సరిపెట్టుకుంది. ప్రజల తలపై ఒక్కొక్కరికీ మూడు నుంచి నాలుగు లక్షల రూపాలయ చొప్పున 5 కోట్ల మంది ప్రజలపై భారం మోపారు. ప్రజల వద్దకు పాలన అంటూ.. వారి లోగుట్టును తెలుసుకుని.. ప్రజలను నడిరోడ్డుపై పెడుతున్నారు. ఇలాంటి విషయాలను పార్లమెంటు వేదికగా కడిగేయండి“అని పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్(రాజ్యసభ)లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అంతేకాదు.. “ఇటు రాష్ట్రంలో మన వాళ్లు చూసుకుంటారు. అటు జాతీయస్థాయిలో మీరు బలమైన గళం వినిపించండి“ అని వారికి సూచించారు. అంటే.. మొత్తంగా ఏపీ పాలనలోని లొసుగులను, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ చేయనున్న అక్రమాలను కూడా పార్లమెంటు వేదికగా పెట్టాలని చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మరిదీనిపై వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.