తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంఎల్ఏలు, అభ్యర్ధులకు ప్రచారంలో ఎదురుదెబ్బలు పెరిగిపోతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార జోరు పెంచాలని అభ్యర్ధులు చేస్తున్న ప్రయ్నతాలకు జనాలు బ్రేకులు వేస్తున్నారు. తమ గ్రామాల్లోకి ప్రచారానికే రానీయటంలేదు. కరీంనగర్, పటాన్ చెరువు, రాజేంద్రనగర్, డోర్నకల్, మహబూబా బాద్, కోదాడ, చొప్పదండి తదితర నియోజకవర్గాల్లో అభ్యర్ధులనే కాదు చివరకు నేతలను కూడా ప్రచారం చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.
దీనికి ప్రధానకారణం ఏమిటంటే గడచిన పదేళ్ళల్లో పార్టీ తరపున పెరిగిపోయిన అరాచకాలు, అవినీతే. మంత్రులు, ఎంఎల్ఏలుగా ఉన్న వాళ్ళు జనాలను చాలా చోట్ల పట్టించుకోలేదు. సమస్యల పరిష్కారం కోసం జనాలు మంత్రులు, ఎంఎల్ఏల చుట్టూ ఎంత తిరిగినా లెక్క కూడా చేయలేదు. పైగా అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమపథకాల పంపిణీలో చాలావరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. పథకాల లబ్దిదారుల్లో అర్హులు తక్కువమంది అనర్హులు ఎక్కువగా లబ్దిపొందారని జనాలు మండిపోతున్నారు.
అనేక కారణాలతో అభ్యర్ధులు ప్రచారంలోకి వస్తున్నపుడు జనాలు ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు. తమ గ్రామాల్లోకి బీఆర్ఎస్ అభ్యర్ధులు, నేతలు ప్రచారం కోసం రావద్దని బోర్డులే పెట్టేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎంఎల్ఏలపై ఇంతటి వ్యతిరేకతను బాహాటంగానే వ్యక్తంచేస్తున్న జనాలు పోలింగ్ రోజున అసలు అధికారపార్టీ అభ్యర్ధులకు ఓట్లేస్తారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. జనాల వైఖరి చూస్తుంటే చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు డౌటుగానే ఉంది. గతంలో జనాల్లో ఇలాంటి వ్యతిరేకత జనాల్లో ఎప్పుడూ కనబడలేదు.
జనాల్లోని వ్యతిరేకతంతా సరిగ్గా ఎన్నికల సమయంలోనే బయటపడుతుండటంతో అభ్యర్ధులతో పాటు కేసీయార్ కు కూడా క్షేత్రస్ధాయిలో సీన్ అర్ధమైపోతున్నట్లుంది. రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తప్పవనే చర్చ జనాల్లో బాగా పెరిగిపోతోంది. మూడో ఎన్నికలో కూడా గెలిచి హ్యాట్రిక్ సీఎం అనిపించుకోవాలన్న కేసీయార్ ఆలోచనలకు బ్రేకులు తప్పేట్లు లేదు. మొత్తానికి చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు ప్రచారంలో ఎదురుదెబ్బలు తగులుతున్నదైతే వాస్తవం. మరి దీని ప్రభావం, జనాగ్రహం చివరకు ఎలాంటి రిజల్టిస్తుందో చూడాలి.