మన దేశంలో ఓటర్ గుర్తింపు కార్డు రావాలంటే 18 ఏళ్లు నిండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఓటరు కార్డును జారీ చేస్తారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.ఇప్పటివరకు ఉన్న విధానాలకు భిన్నంగా కొత్త విధానం గురించి వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం.. ఓటరు కార్డు రావాలంటే 18 ఏళ్లు వచ్చే వరకు అప్లై చేయకుండా ఆగాల్సిన అవసరం లేదు. కొత్తగా.. తీసుకున్న నిర్ణయం ప్రకారం అంతకు ముందే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారి పేరును రిజిస్టర్ చేస్తారు. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం 18 ఏళ్లు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ను 17 ఏళ్ల వయసులోనే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను తాజాగా జారీ చేశారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్.. ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (గురువారం) దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు.. ఈఆర్ఓ.. ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 17 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు జాబితాలో తమ పేరునునమోదు చేసుకోవటానికి వీలుగా దరఖాస్తులు చేసుకునే అవకాశాన్నికల్పించాలని పేర్కొంది. అంతేకాదు.. ఈ కొత్త విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా కోరింది.
అయితే.. 17 ఏళ్ల వయసుకే ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ.. వారికి ఓటు హక్కు.. ఓటు గుర్తింపు కార్డును మాత్రం పద్దెనిమిదేళ్లు రాగానే మాత్రమే జారీ చేస్తారు. తాజా నిర్ణయంలో భాగంగా ఆర్పీ యాక్టు 1950 సెక్షన్ 14 బీ.. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్ 1960చట్టాల్లోనూ కేంద్ర న్యాయశాఖ మార్పులు చేసింది. అంతేకాదు.. ఓటరు కార్డు కూడా జారీ చేసే దరఖాస్తుల్ని సైతం మరింత సరళతరంగా ఉండేలా మార్చనున్నారు. ఈ కొత్త అప్లికేషన్లు ఈ ఆగస్టు 1 నుంచి (అంటే మరో మూడు రోజుల తర్వాత) అందుబాటులోకి వస్తాయి. సో.. 17 ఏళ్ల వాళ్లంతా తమ ఓటరు కార్డు కోసం ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు.