ఏరి కోరి నియమించి.. వారి చేతికి విశేష అధికారాలు అప్పజెప్పిన జగన్ సర్కారుకు సొంత సైన్యం నుంచే ధిక్కార స్వరం వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన వాలంటీర్లు తాజాగా సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్న వారు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో వారు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరుతున్నారు.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయటం తెలిసిందే. 2019 అక్టోబరులో వీరి నియామకాలు పూర్తి అయ్యాయి. వీరికి నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతాన్ని చెల్లిస్తోంది. జగన్ సర్కారు చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు.. ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లోనూ కీలక భూమిక పోషిస్తున్నారు.
తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచకపోవటం.. సర్వీసుల్ని క్రమబద్ధీకరించకపోవటం.. తదితర సమస్యలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో.. వారు గుర్రుగా ఉంటున్నారు. తమ సమస్యల్ని తీర్చని ప్రభుత్వం తీరుపై నిరసనను వ్యక్తం చేసేందుకు వీలుగా ప్రభుత్వ కార్యక్రమాల్ని బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా జోరుగా నిర్వహిస్తున్న ఆడుకుందాం ఆంధ్రా ప్రోగ్రాంను బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. ఏపీ మొత్తం ఇలాంటి పరిస్థితి లేకున్నా.. రెండు మూడు జిల్లాల వారు ఓపెన్ గా తమ అసంత్రప్తిని వ్యక్తం చేస్తుంటే.. మిగిలిన వారిలో అత్యధికులు ఆగ్రహంతో ఉన్నారు.
వీరిని సమ్మై చేయకుండా ఆపేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు తాము పెట్టిన గడువు డిసెంబరు 25తో ముగియటంతో.. పలువురు వాలంటీర్లు తమ విధుల్ని బహిష్కరించేందుకు సిద్దమవుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న పాటి వేతనం కూడా తమకు ఇవ్వకపోవటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. క్రిష్ణా.. కర్నూలుజిల్లా.. మన్యం జిల్లా పార్వతీపురం.. తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వాలంటీర్లుపలువురు ఈ నెల 26 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లుగా తమ వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకున్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని బహిష్కరించాలని డిసైడ్ అయినట్లు చెబతున్నారు. సమ్మె చేసేందుకు ఇదే సరైన సమయమని.. ఎన్నికలకు దగ్గరకు వచ్చిన వేళలో.. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. సమ్మెకు వెళ్లొద్దని.. ప్రభుత్వం స్పందిస్తుందని.. తొందరపాటు వద్దని అధికారులు చెబుతున్నా.. ఫలితం మాత్రం అంతంతమాత్రంగా ఉందన్న మాట వినిపిస్తోంది. జగన్ సర్కారు నియమించిన సొంత సైన్యం ఇలా సమ్మె సైరన్ మోగించే వరకు వెళ్లటం ఎవరిది తప్పు? ఎక్కడ పొరపాటు దొర్లుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.