ఏపీలో వాలంటీర్లు ఎన్నికల విధులు నిర్వహించకూడదని, వారిని ఏజెంట్లుగా నియమించేందుకు వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ అభ్యర్థి తరఫునా వారు ఏజెంట్లుగా ఉండకూడవని,వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జగన్ సర్కారును గతంలో హెచ్చరించింది. ఈ ఆదేశాలను అన్ని జిల్లాలకు చెందిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు అధికారికంగా తెలియజేసింది.
ఓటర్ల నమోదు.. తొలగింపు.. చేర్పులు.. మార్పులు.. ఓటర్ల జాబితా ప్రచురణ.. పోలింగ్ కేంద్రాల ఎంపిక.. ఎన్నికల రోజు ఓటరు చీటీల పంపిణీ.. పోలింగ్ ఏర్పాట్లు.. పోలింగ్ విధులు.. ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లోనూ వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా ఉంటూ, ఏదో ఒక పార్టీకి అనుబంధంగా, అనుకూలంగా పనిచేసేందుకు వీల్లేదన్నది ఆ ఆదేశాల సారాంశం.
కానీ, ఈ ఆదేశాలు మాత్రం వైసీపీ నేతలకు పట్టవు. తాజాగా వాలంటీర్లకు వత్తాసు పలుకుతూ చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఏది మంచి ప్రభుత్వమో, ఎవరికి ఓటేయాలే చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందని ధర్మాన సెలవిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లేనని ధర్మాన అన్నారు. ఇక, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులన్నీ వాలంటీర్లకు కూడా ఉంటాయని ఉపోద్ఘాతమిచ్చారు ధర్మాన.
నిత్యవసర వస్తువుల ధరలు ఏపీతోపాటు దేశమంతా పెరుగుతున్నాయని, దానికి ఏం చేయగలమని ధర్మాన ప్రశ్నించారు. వాలంటీర్లు తెలివైన వారని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ధర్మాన చెప్పారు. ప్రజలను సరైన దారిలో తీసుకెళ్లాలని, ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో ఏ పార్టీ మంచిదో వాలంటర్ చెప్పకూడదని ఎవరున్నారు అంటూ ధర్మాన ప్రశ్నించారు. దీంతో ధర్మాన ప్రసాదరావుపై ట్రోలింగ్ జరుగుతోంది.