విశాఖపట్నం విహార యాత్రకు కేంద్రంగా మారడానికి కీలకమైన రుషికొండ బీచ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ పర్యాటకుల ను కూడా ఆకర్షించిన ఈ బీచ్‌కు.. ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలోనే దీనికి `బ్లూ ఫాగ్` సర్టిఫికేషన్ కూడా వచ్చింది. పర్యాట కులకు కనుల విందు చేయడమే కాకుండా.. ఆదాయంలోనూ ఈ బీచ్ పుంజుకుంది. దేశంలోని పర్యాటక బీచ్‌లలో గోవా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. రుషికొండ బీచ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. హుద్ హుద్ తుఫాను వచ్చిన తర్వాత.. ఈ బీచ్ మొత్తంగా కొట్టుకుపోయింది.
అయితే.. నాటి చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన అభివృద్ధి, పునర్నిర్మాణ కార్యక్రమాలతో బీచ్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఆ తర్వాత.. చంద్రబాబు సర్కారు.. దీనిని మరింత అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మలచింది. విశాఖ వెళ్లిన ఇతర ప్రాంతాల వారు రుషికొండ బీచ్‌ను చూడకుండా తిరుగు ప్రయాణం కట్టరంటే అతిశయోక్తి కాదు. నిత్యం సాయంత్రం 3గంటల నుంచే కిటకిటలాడే ఈ బీచ్ ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. చిన్న చిన్న హాకర్లు, తోపుడు బండ్ల వారికి ఈ బీచ్ జీవనాధారంగా మారిపోయింది.
ఇక, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇతర ప్రాంతాల మాట ఎలా ఉన్నా.. రుషికొండ బీచ్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. దీనిని డెవలప్ చేయడమే కాకుండా.. పర్యాటకులను ఆకర్సించేందుకు అనేక కార్యక్రమాలను కూడా రూపొందించింది. సముద్రం లో తేలుతూ.. వెళ్లే సౌకర్యాలను వ్యక్తిగతంగా కల్పించింది. అదేవిధంగా స్వల్పకాలిక బోట్ల విహారానికి కూడా అనుమతులు తెచ్చింది. ఈ క్రమంలోనే 2020లో రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ దక్కింది. దీంతో పర్యాటకులు మరింత మంది పెరిగారు.
అయితే.. ఇటీవల కాలంలో బీచ్ ను స్థానిక యంత్రాంగం పట్టించుకోవడం మానేసింది. దీంతో నాచు పేరుకుపోయి.. బీచ్ కళావిహీనంగా మారింది. దీంతో తాజాగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను ఉపసంహరిస్తూ..కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించారని తెలిపారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ అప్డేట్ చేయాలని బ్లూ ఫ్లాగ్ ఫౌండేషన్ సూచించిందన్నారు.