టెలికాం.. ఎల్ఐసీ.. భారతీయ రైల్వేలు.. ఇలా ప్రైవేటు బాట పట్టించేందుకు యమా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా తన గురిని విశాఖ ఉక్కుపై పెట్టింది. ఒకప్పుడు విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఎలుగెత్తి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం ప్రైవేటీకరించేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయించింది. ఇదే విషయాన్ని ట్వీట్ తోనూ కన్ఫర్మ్ చేశారు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే. విశాఖ ఉక్కు సంస్థపై యాజమాన్య హక్కుల్ని వదులుకొని పూర్తిగా ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా ప్రకటించారు. దీన్ని వంద శాతం వదిలించుకోవటానికి వీలుగా కేంద్ర మంత్రి వర్గం జనవరి 27న ఆమోదముద్ర వేసినట్లుగా పేర్కొంది.
1971లో తెలుగు ప్రజలంతా ఏకమై పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం గతంగా మారి.. ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది. ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతానికి కేంద్రానికే వందశాతం వాటాలు ఉన్నాయి.దేశంలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఉక్కుకర్మాగారం ఇదే. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థ.. తర్వాత కాలంలో తేరుకుంది. కరోనా నేపథ్యంలో మరోసారి నష్టాల బారిన పడిన ఈ సంస్థను.. ఆ నష్టాల లెక్క చూపించి వదిలించుకోవాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సంస్థను లాభాల బాటలో నడిచేందుకు వీలుగా ప్రముఖ కన్సల్టెంట్ మెకెన్సీని పెట్టుకున్నారు. తాజా పరిణామాలు చూస్తే.. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లే కన్నా.. సంస్థను వదులుకోవటానికే ఏర్పాటు చేశారా? అన్న సందేహం రాక మానదు. ఏమైనా.. విశాఖ ఉక్కు కేంద్రాన్ని కేంద్రం వదులుకోవటానికి సిద్ధం కావటం షాకింగ్ గా మారింది.