ఉట్టికెగరలేనమ్మ…స్వర్గానికెగిరిందట….ఈ సామెత జగన్ సర్కార్ కు అతికినట్టు సరిపోతుంది. ఓ వైపు ఏపీలో ఉన్న కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పెట్టెబేడె సర్దుకొని వెళ్లిపోతుంటే….మరోవైపు వైసీపీ నేతలు మాత్రం విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కొత్త కంపెనీల మాట దేవుడెరుగు…కనీసం ఆల్రెడీ ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యత.
కానీ, ఆ కనీస బాధ్యతగా ఉండడం చేతగాని జగన్ సర్కార్…విశాఖను ఐటీ హబ్ గా చేస్తాననడంపై విమర్శలు వస్తున్నాయి. పాత ఐటీ పాలసీ ముగిసి ఏడాదిన్నర గడిచింది. ఇప్పటిదాకా కొత్త ఐటీ పాలసీ ఊసేలేదు. దీనికి తోడు, విశాఖలో బడా కంపెనీల నుంచి కొందరు ప్రభుత్వ పెద్దల వసూళ్ల దందా వ్యవహారం ఆరోపణలు దుమారం రేపాయి. దీంతో, మనకెందుకు వచ్చిన గోలరా బాబూ అంటూ ఐబీఎం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫిన్టెక్ వ్యాలీ వంటి కంపెనీలు వెళ్లిపోయాయి.
చంద్రబాబు హయాంలో ఫార్చ్యూన్-500 కంపెనీలతో చర్చించి, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇప్పించడంతో అప్పట్లో ఏపీకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది. జగన్ పగ్గాలు చేపట్టాక అనుకూల వాతావరణం లేక ఐబీఎం వంటి దిగ్గజ సంస్థ టాటా చెప్పేసింది. ఇక, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ఫార్చ్యూన్-500 కంపెనీకి చంద్రబాబు సర్కార్ కేటాయించిన 40 ఎకరాలభూమిని కక్ష పూరితంగా జగన్ రద్దు చేయడంతో ఐటీ వర్గాల్లో కలకలం రేగింది.
అయితే, తన పొరపాటును తెలుసుకున్ జగన్..మధురవాడ హిల్ నంబరు 4పై 25 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు కేటాయించినా…తమకు జరిగిన అవమానానికి ఆ కంపెనీ ఏపీ మొహం చూడడానికి ఇష్టపడలేదు. ‘ఫిన్టెక్ వ్యాలీ’లోని కంపెనీలూ జగన్ సర్కార్ నిర్వాకాలకు వెనక్కి వెళ్లిపోయాయి. ఇలా, విశాఖ బ్రాండ్ నేమ్ ను చెడగొట్టి ఉన్న ఐటీ కంపెనీలకు పట్టపగలే చుక్కులు చూపించి వెళ్లిపోయేలా చేసిన జగన్ సర్కార్…విశాఖను ఐటీ హబ్ గా చేస్తాననడం హాస్యాస్పదం అని విమర్శలు వస్తున్నాయి.