ఓ వైపు అమరావతే ఏపీ రాజధాని అంటూ హైకోర్టు చెబుతోంది. మరోవైపు, ఒక రాష్ట్రం..ఒక రాజధాని అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఓ ఉద్యమంలా పాదయాత్ర జరుగుతోంది. ఇక, ఇవేమీ పట్టనట్లు అసెంబ్లీలో తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామంటూ వైసీపీ సభ్యులు పదే పదే చెబుతున్నారు. మూడు రాజధానులపై ఈ సమావేశాల్లో కొత్త బిల్లు ప్రవేశపెడుతామంటున్నారు.
ఒకవేళ కొత్త బిల్లు ప్రవేశపెడితే..దానిపై కూడా కచ్చితంగా న్యాయపోరాటం చేయడానికి అమరావతి రైతులు, టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. గతంలో మాదిరిగానే అమరావతిపై కోర్టు రైతులకు అనుకూలంగానే తీర్పునిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి, మూడు రాజధానుల అమలుకు గ్యారెంటీ లేదు. ఇలా, ఇవన్నీ జరుగుతుండగానే…మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ రాజధానిగా పాలన చేస్తామని అమర్ నాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, ప్రజలంతా దీనికి సిద్ధంగా ఉండాలంటూ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. పాలన వికేంద్రీకరణపై త్వరలో అసెంబ్లీలో బిల్లు పెడతామని, మూడు రాజధానుల ఏర్పాటే తమ విధానమని అన్నారు. అంతేకాదు, అమరావతిలో రాజధాని పేరిట రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృధ్ధి చేస్తామని, విశాఖలో భూ అక్రమాల ఆరోపణలపై టీడీపీ నేతలు ఆధారాలు చూపాలని అమర్ నాథ్ సవాల్ విసిరారు. విశాఖలో రాజధాని కోసం ఒక సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేదని వెల్లడించారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటి కాదని చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఏం జరిగినా అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.