విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం అయిందని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీని ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయని జగన్ తో పాటు వైసిపి నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. మొత్తం 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని, 15 కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని జగన్ అన్నారు.
ఇక, పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా సహకరిస్తామని, చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నాలుగేళ్లలో జగన్ చేసిందేమీ లేదంటూ రఘురామ చురకలంటించారు. ఇంకా చెప్పాలంటే విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఒక మాయాబజార్ అని ఆయన సెటైర్లు వేశారు. పెట్టుబడుల పేరుతో విశాఖలో భూకబ్జాలకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఈ కంపెనీలన్నింటికీ ఏడు లక్షల ఎకరాల భూమిని ఎలా ఇస్తారని రఘురామ ప్రశ్నించారు. నాలుగేళ్ల కాలంలో జగన్ చేసింది ఏమీ లేదని, అందుకే ఇప్పుడు ఎన్నికల ముందు హడావిడిగా ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ పుట్టకముందు నుంచే విశాఖ, అక్కడ పరిశ్రమలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సజావుగా పరిపాలన సాగించాలని జగన్ ను కోరుతున్నానని రఘురామ అన్నారు.