సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ కేసు మిస్టరీ ఇంకా వీడని సంగతి తెలిసిందే. తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలంటూ వివేకా కూతురు సునీత కడప గల్లీ మొదలు ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. ఇక, ఈ హత్య వెనుక తన బంధువులు అవినాష్ రెడ్డి ఉన్నారంటూ సునీత చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. తన తండ్రిని చంపిన వారు తన చుట్టూనే తిరుగుతూ ఉన్నారని, అది తాను కనుగొనలేకపోయానని సునీత కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు సంచలనం రేపాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఇదే తరహాలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. వివేకాను ఎమ్మెల్సీగా ఓడించి..ఎన్నో ఇబ్బందులు పెట్టి..పక్కకు తోసేయాలి అని ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. అది తాము గ్రహించలేకపోయామని, ఏ మనుషుల్లో ఏముందో తెలుసుకులోకేపోయానని వాపోయారు. వివేకాపై, తమపై జగన్ కు ఇంత ద్వేషం ఉందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోనే తమ శత్రువులున్నారని గ్రహించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి అంటూ గద్గద స్వరంతో వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.