తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సొంత చెల్లెలు అని కూడా చూడకుండా షర్మిలపై జగన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. పసుపు చీర కట్టుకుని.. వైఎస్ ను తిట్టిపోసిన, ఆయనను శత్రువుగా చూసిన వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించిన వారా? వైఎస్ వారసులు.? అంటూ తోడబుట్టిన చెల్లెలు షర్మిల వస్త్రధారణను అపహాస్యం చేశారు. తన జీవితాంతం వైఎస్ రాజకీయ పోరాటం చేసిన వారితో చెలిమి చేసేది? వారు రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ.. వైఎస్ వారసులుగా చెప్పుకొంటే ప్రజలు హర్షిస్తారా? అని షర్మిలపై జగన్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
ఇక, వివేకా హత్య చేసిన హంతకుడికి బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పి.. హంతకుడు బయట స్వేచ్ఛగా తిరిగేలా చేసిన ఈ చెల్లెమ్మలు ఇప్పుడు వివేకా హత్యపై కన్నీరు కారుస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించారని, అతడు ఏ తప్పూ చేయలేదు కాబట్టి టికెట్ ఇచ్చానని జగన్ అన్నారు. చిన్నాన్న వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని, ఆయనకు సంతానం ఉందని, ఈ విషయం అందరికీ తెలుసని జగన్ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు వివేకా రెండో పెళ్లి విషయం జగన్ కు ఎందుకు గుర్తుకు రాలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్ ను ఏకిపారేస్తున్నారు.