కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. టెంకాయ కొట్టడానికి వంగలేని జగన్… చంద్రబాబును ముసలోడంటున్నాడని అయ్యన్న ఫైర్ అయ్యారు. రోజాకు సంస్కారం లేదని, ఆమె గురించి మాట్లాడి తమ విలువ తగ్గించుకోబోమని అన్నారు. జగన్ డైరెక్షన్ లోనే వివేకా హత్య జరిగిందని, ఎంపీ టికెట్టే ఈ హత్యకు కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
వివేకా హత్యను చంద్రబాబుకు ఆపాదించారని, అధికారంలోకి వచ్చాక కేసు మాఫీ చేయాలని చూశారని చురకలంటించారు. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలుతున్నాయని, రక్తపు మడుగులో పడి ఉన్న వివేకాది గుండెపోటు అని విజయసాయిరెడ్డి ఎలా చెప్పారని అయ్యన్న ప్రశ్నించారు. ఈ హత్య కేసులో సాయిరెడ్డిని కూడా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోడికత్తి కేసులో నాలుగేళ్లు గడిచినా విచారణ కొనసాగుతూనే ఉందని విమర్శించారు.
అమరావతి విషయంలో జగన్ వి తుగ్లక్ నిర్ణయాలని, ముఖ్యమంత్రి జగనా? లేక సజ్జలా? అనే సందేహం వ్యక్తం చేశారు. ఏ చట్టం ప్రకారం విశాఖను రాజధానిగా ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్.. దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు తీశారని అన్నారు. విజయసాయిరెడ్డి రూ. 40 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. జగన్ పాలనపై ప్రజలు ఇకనైనా కళ్లు తెరవాలని, లేకపోతే వారి పిల్లలకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.