వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం కీలక మలుపుగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఏ4గా ఉన్న డ్రైవర్ విచారణలో అప్రూవర్ గా మారి సంచలన విషయాలు వెల్లడించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. అదే తరహాలో మరోసారి దస్తగిరితో సీబీఐ అధికారులు 164 వాంగ్మూలాన్ని ఇప్పించాలని నిర్ణయించారు. అయితే, దస్తగిరి అప్రువర్ గా మారడాన్ని సహచర నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలు వ్యతిరేకిస్తూ కడప కోర్టు తీర్పును సవాల్ చేస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
అయితే, ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి లైన్ క్లియర్ అయింది. దీంతో సీబీఐ అధికారులు దస్తగిరితో రెండవసారి 164వాంగ్మూలం ఇప్పించేందుకు పులివెందుల కోర్టు అనుమతిని తీసుకున్నారు. ఈ ప్రకారం పులివెందుల ఆర్అండ్బీగెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారుల బృందం దస్తగిరిని గంటపాటు విచారణ జరిపారని తెలుస్తోంది. పులి వెందుల కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరితో మెజిస్ట్రేట్ 164 వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలిసింది.
దీంతో, ఈ సారి వాంగ్మూలంలో దస్తగిరి ఎవరి పేర్లు బయటపెడతాడోనని కొందరు నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయట. గత ఏడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి తొలిసారి మేజిస్ట్రేట్ ముందు 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఎర్రగంగి రెడ్డి హత్యకు ప్లాన్ చేశాడని, రూ.40 కోట్లకు డీల్ కుదిరిందని వెల్లడించడం కలకలం రేపింది. ఈ డీల్ లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మధ్యవర్తిగా ఉన్నాడని, దీని వెనుక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పినట్లు ప్రచారం జరిగింది.
దీంతో, తాజాగా రెండో సారి వాంగ్మూలంలో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పేర్లతోపాటు మరికొందరు వైసీపీ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఆ వాంగ్మూలాన్ని బట్టి సీబిఐ బృందం వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంతేకాదు, దస్తగిరి ఇచ్చే సమాచారంతో మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి విచారణ జరిపుతారని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, సీబీఐ అధికారుల అభ్యర్థన ప్రకారం వైఎస్ వివేకా హత్య కేసు పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది.