వివేకా హత్య కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన వైఎస్ సునీతా రెడ్డి వాంగ్మూలం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. జగన్ తో సునీత మాట్లాడిన మాటలు, వివేకా మర్డర్ ను జగన్ ఎంత లైట్ తీసుకున్నారన్న సంగతి ఇపుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సునీత వాంగ్మూలంలో చెప్పిన మరిన్ని విషయాలు షాకింగ్ గా మారాయి. దీంతోపాటు, ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపై సునీత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తన తండ్రిని చంపిన హంతకులను శిక్షించాలని అన్న జగన్ ను సజ్జల, సవాంగ్ ల సమక్షంలో బతిమాలానని సునీత వెల్లడించారు. ఈసీ గంగిరెడ్డి (వైఎస్ భారతి తండ్రి) ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరును అనుమానితుల జాబితాలో చేర్చడంపై కూడా జగన్ కోప్పడ్డారని వాంగ్మూలమిచ్చారు. తన తండ్రి మరణ వార్త విన్న ఉదయ్…బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకునేందుకు బాణసంచా కొనుగోలుకు యత్నించారని, అటువంటి వ్యక్తి పేరు ఎందుకు చేర్చావని తనను జగన్ అడిగారని బాధపడ్డారు.
ఈ కేసులో సీబీఐ విచారణ కావాలని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల ద్వారా జగన్ ను కోరానని, అయితే, సీబీఐ విచారణ కోరుతూ తాను కోర్టును ఆశ్రయిస్తే జగన్ రాజకీయ భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని వారు చెప్పారని గుర్తు చేశారు. తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రూ.104 కోట్ల వ్యవహారంలో భరత్ యాదవ్, సునీల్ యాదవ్‌తో కలిసి వివేకా సెటిల్ చేశారని, అందులో వివేకాకు రూ.4 కోట్లు వచ్చాయని తెలిసిందన్నారు.
అయితే, ఆ నాలుగు కోట్లలో వాటా ఇవ్వాలని భరత్, సునీల్ డిమాండ్ చేశారని, కోటిన్నరకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వివేకా బదులిచ్చారని చెప్పారు. తన తండ్రిని చంపిందెవరో దస్తగిరికి తెలుసని, వేకువ జామున అక్కడే ఉన్నాడని చెప్పారు.