సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఏపీలో నత్త నడకన సాగుతోందంటూ వివేకా కూతురు సునీత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారులపై కూడా ప్రైవేట్ కేసులు పెడుతున్నారని ఆమె సుప్రీం కోర్టు తలుపుతట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని, సాక్షులను నిందితులు, అనుమానితులు ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. దీంతో, ఈ కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించాలని సుప్రీం ఆదేశించింది.
ఈ క్రమంలోనే ఈ కేసును హైదరాబాద్ కు మార్చిన తర్వాత విచారణ వేగవంతమయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి…సీబీఐ విచారణకు కొద్ది రోజుల క్రితం హాజరయ్యారు. ఇక తాజాగా నేడు ఈ కేసులోని ఐదుగురు నిందితులు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కడప జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసిన కోర్టు…ఆ రోజు ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది.
కడప జైల్లోని ముగ్గురు నిందితులను విచారణ కోసం భారీ భద్రతతో హైదరాబాద్ కు తరలించడం కష్టతరంగా ఉందన్న సీబీఐ అధికారుల విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. కోర్టు ఆదేశాలతో ఆ ముగ్గురిని చంచల్ గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నేటి విచారణకు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి వ్యక్తిగతంగా హాజరయ్యారు.