గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. గామి తర్వాత అతను ఎక్కువ టైం తీసుకుని చేసిన మూవీ ఇది. గత ఏడాది డిసెంబరు 8నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. నిర్మాతలు ఆ డేట్ నుంచి వెనక్కి తగ్గినందుకు విశ్వక్సేన్ ఎంత ఫీలయ్యాడో కూడా తెలిసిందే. అప్పటికే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందనుకున్న సినిమా కాస్తా.. మార్చిలో కూడా విడుదల కాలేదు.
ఈ నెల 8న డేట్ అనుకుని మళ్లీ వెనక్కి తగ్గారు. ఆ డేట్కే విశ్వక్ మరో చిత్రం గామి రిలీజైంది. ఆ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద అంచనాలు పెరిగాయి. కానీ దీని రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది.
మిడ్ సమ్మర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మే 17కు డేట్ ఫిక్స్ అయింది. ఐతే ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడడంతో ఈసారైనా పక్కానా అని విశ్వక్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చాలా టైం ఉంది కాబట్టి ఈసారి ఫిక్స్ అనుకోవచ్చు. రౌడీ ఫెలో మూవీతో దర్శకుడిగా మారిన గేయ రచయిత కృష్ణచైతన్య అరంగేట్రంలోనే తన ప్రతిభను చాటుకున్నాడు.
కమర్షియల్గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా అదొక ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఛల్ మోహనరంగ లాంటి లవ్ స్టోరీతో పర్వాలేదనిపించిన కృష్ణచైతన్య.. ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి మాస్ మూవీతో వస్తున్నాడు. విశ్వక్ సరసన నేహా శెట్టి నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందిస్తున్నాడు.