తెలుగువాడైనప్పటికీ తమిళంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదిగిన నటుడు విశాల్. పందెంకోడితో తొలి కమర్షియల్ హిట్ కొట్టిన అతను.. ఆ తర్వాత యాక్షన్ సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదంచుకున్నాడు. ఒక టైంలో విశాల్ యాక్షన్ బాట వీడకుండానే వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేసేవాడు.
రుద్రుడు, కథకళి, డిటెక్టివ్, అభిమన్యుడు లాంటి మంచి మంచి సినిమాలు వచ్చాయి అతడి నుంచి. ఆ సినిమాలు తమిళంలోనే కాక తెలుగులోనూ బాగా ఆడాయి. కానీ గత కొన్నేళ్లలో మాత్రం విశాల్ పూర్తిగా గాడి తప్పాడు. రొటీన్ మాస్ సినిమాలతో తీవ్ర నిరాశకు గురి చేశాడు. తమిళంలోనే కాక తెలుగులో కూడా అతడి మార్కెట్ బాగా దెబ్బతినేసింది. ఇలాంటి టైంలో విశాల్ చేసిన సినిమానే.. మార్క్ ఆంటోనీ.
వినాయక చవితి కానుకగా ఈ నెల 15న మార్క్ ఆంటోనీ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్‌ను ఆదివారం లాంచ్ చేశారు. విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హాలీవుడ్లో పాపులర్ అయిన.. తెలుగు, తమిళంలో ఇప్పటికే కొన్ని చిత్రాల్లో టచ్ చేసిన టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఒక ఫోన్ ద్వారా వేరే కాలానికి వెళ్లి అక్కడి మనుషుల్ని కలిసే కథను డీల్ చేశాడు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్.
ఇలాంటి కథను విశాల్ లాంటి మాస్ హీరో చేయడమే హైలైట్. విశాల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా.. వేరే కాలంలో ఉన్న తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే కొడుకు కథ ఇది. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఓల్డ్ క్యారెక్టర్, గుండు గెటంప్ వెరైటీగా ఉన్నాయి. ఎస్.జె.సూర్య క్యారెక్టర్ సైతం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సీజీ ద్వారా సిల్క్ స్మిత పాత్రను రీక్రియేట్ చేయడం విశేషం. మొత్తంగా చూస్తే ట్రైలర్ క్రేజీగా ఉండి.. విశాల్‌కు చాన్నాళ్ల తర్వాత ఓ హిట్ అందించేలా కనిపిస్తోంది.