పునీత్ రాజ్ కుమార్.. గడిచిన మూడు రోజులుగా వినిపిస్తున్న పేరు గురించి తెలుసుకున్న తెలుగువారు సర్ ప్రైజ్ తో పాటు షాక్ కు గురవుతున్నారు. తమ పక్కనే ఉన్న కర్ణాటకలో ఇలాంటి హీరో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని.. అలాంటి వ్యక్తి గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకోవటమా? అని ఫీల్ అయ్యేవారు కోట్లాదిగా ఉన్నారు.
సినిమాను అమితంగా ప్రేమించి.. ఆరాధించే తెలుగువారికి.. పునీత్ ‘రియల్ హీరోయిజం’ తెలిసిన తర్వాత కన్నీటి పర్యంతమవుతున్నారు. అలాంటి మంచి వ్యక్తి అంత త్వరగా దేవుడు తీసుకెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
పునీత్ ఆకస్మిక మరణం కన్నడ ప్రజలను ఎంతలా కలిచివేసిందో.. మీడియా.. సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు ప్రజల్ని కూడా అంతే వేదనకు గురి చేసింది.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు బెంగళూరుకు వెళ్లి పునీత్ కు నివాళులు అర్పించటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హీరో విశాల్ మిగిలిన వారందరికంటే భిన్నంగా వ్యవహరించారు. ఆయన నోటి నుంచి వచ్చిన తాజా మాటలు వింటే.. గ్రేట్ విశాల్.. సెల్యూట్ విశాల్ అన్న మాటను అనకుండా ఉండలేం.
దీపావళి వేళ విడుదల కానున్న తన ‘ఎనిమీ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలక ప్రకటన వచ్చింది. పునీత్ లేరనే విషయాన్ని తానింకా జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పిన విశాల్.. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు.. సమాజానికీ తీరని లోటుగా పేర్కొన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో పునీత్ లాంటి గొప్ప వ్యక్తిని తాను చూడలేదన్నారు.
మేకప్ ఉన్నా.. మేకప్ తీసేసినా.. ఇంట్లో కలిసినా.. బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా ఉండేవారు.. మాట్లాడేవారని.. పునీత్ లాంటి గొప్ప వ్యక్తిని తాను చూడలేదన్నారు. తను లేరంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నట్లు చెప్పిన విశాల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నాడు’ అని పేర్కొన్నారు.
పునీత్ ఎంతోమందికి ఉచిత విద్యను అందించారని.. ఓల్డేజ్ హోమ్ లు నడిపారని.. సమాజానికి ఎన్నో మంచి పనులుచేశారని.. ఇన్ని పనులు ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చని.. కానీ ఒక మనిషి చేశారంటే మాత్రం నమ్మటం కష్టమన్న విశాల్.. ‘‘1800 మంది చిన్నారులను తన స్నేహితుడిగా నేను చదివిస్తానని మాటిస్తున్నా. పునీత్ సేవా కార్యక్రమాలకు నా వంతు చేయూతను అందిస్తా’ అంటూ కీలక ప్రకటన చేశారు.
స్నేహితుడు.. సన్నిహితులు.. మంచి మనిషి లాంటి మాటలు ఎవరైనా చెబుతారు. కానీ.. తనకెంతో ఆఫ్తుడనే వ్యక్తి చేసిన కార్యక్రమాల్ని.. అతను లేని వేళ.. అతడికి గుర్తుగా కొనసాగిస్తానని చెప్పటం మామూలు విషయం కాదు. ఈ విషయంలో విశాల్ ది గ్రేట్ అనకుండా ఉండలేం. చివరగా.. సెల్యూట్ చేయాల్సిందే.