సైద్ధాంతిక విభేదాలు సవాలచ్చ ఉండొచ్చు. వాటిని వేర్వేరు వేదికల మీద చర్చకు పెట్టి మాటలతో ఉతికి ఆరేయొచ్చు. అందుకు భిన్నంగా కీలక ఉద్యోగిగా వ్యవహరిస్తూ.. సదరు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా దాడి చేయటం.. అదేమంటే భావోద్వేగాల మాటలు చెప్పటం సరైనదేనా? అన్నది ప్రశ్న. ఇదంతా ఏ ఇష్యూలో అంటే.. పంజాబ్ రైతులు చేస్తున్న నిరసనపై అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలు.. దానిపై కోపాన్ని మనసులో దాచుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి ఎయిర్ పోర్టులో చెకింగ్ వేళ చెంప ఛెళ్లుమనిపించటం తెలిసిందే.
ఈ ఇష్యూలో ఆమెను సస్పెండ్ చేసి.. అరెస్టు చేయటం తెలిసిందే. అయితే..ఈ ఉదంతంపై తాజాగా బాలీవుడ్ కు చెందిన విశాల్ దద్లానీ స్పందిస్తూ.. తాను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వనని చెబుతూనే.. సదరు మహిళా పోలీసు అధికారి కోపాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. సదరు మహిళా అధికారిపై ఏమైనా చర్యలు తీసుకుంటే తాను ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించటం ద్వారా కొత్త వివాదానికి తెర తీశారు.
దీని గురించి మాట్లాడుకోవటానికి ముందు గతంలో కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్య ఏమిటని చూస్తే.. పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఆందోళనపై స్పందిస్తూ.. ‘‘రూ100 తీసుకొని వాళ్లంతా ఆ ఆందోళనల్లో పాల్గొంటున్నారు’’ అంటూ ట్వీట్ చేసి.. దానిపై విమర్శలు వెల్లువెత్తటంతో ఆ పోస్టును డిలీట్ చేశారు. ఈ పోస్టును మనసులో పెట్టుకున్న ఎయిర్ పోర్టు సెక్యూరిటీ ఉద్యోగిని కుల్విందర్ సమయం కోసం వేచి చూసి.. తాజాగా చండీగఢ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన కంగనా.. సెక్యురిటీ చెక్ కు వెళ్లగా ఆమె చెంప ఛెళ్లుమనిపించింది. ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే.. రైతులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా కొట్టినట్లుగా పేర్కొనటం తెలిసిందే.
తమకు నచ్చని రీతిలో వ్యాఖ్యలు చేసిన వారిపై భౌతిక దాడులకు దిగితే.. ఇక చట్టంతో ఏం పని ఉంది? ఎవరికి వారు తమకు తామే తీర్పులు ఇచ్చేసుకుంటూ శిక్షలు అమలు చేయటం దేనికి నిదర్శనం? ఇలా ఎవరికి వారు హింసకు పాల్పడిన వారికి మద్దతుగా నిలిచి.. ధన సాయం చేస్తాను.. జాబ్ ఇస్తానని చెప్పటం ఎంతవరకు సబబు? ఉదాహరణకు ఒక వర్గానికి చెందిన వారిపై ఒక ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్య చేశారనుకుందాం.
ఆ మాటల్ని మనసులో ఉంచుకొని దాడికి పాల్పడి.. అందుకు ఎమోషనల్ అంశాలను తెర మీదకు తీసుకొస్తే చేసిన తప్పు ఒప్పు అవుతుందా? సీఎం మీద దాడి చేసిన వ్యక్తికి నజరానాలు.. జాబ్ ఆఫర్లు లాంటివి ఇవ్వటం మొదలు పెడితే.. ఎలాంటి కల్చర్ ను ప్రమోట్ చేసినట్లు అవుతుంది? అన్నది ప్రశ్న.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు ఎక్కడైనా.. ఏదైనా అనుకోని చేదుఅనుభవం ఎదురైతే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా సదరు సెలబ్రిటీకి మద్దతుగా నిలుస్తారు. తాజా ఎపిసోడ్ లో మాత్రం విశాల్ దద్లానీ మాత్రం కంగనాకు బదులుగా చెంప దెబ్బ కొట్టిన అధికారికి మద్దతు ఇవ్వటం.. జాబ్ ఆఫర్ చేయటం సంచలనంగా మారింది.