విశాఖ ఉక్కును సైలెంట్ గా అమ్మేద్దామని మోడీ – జగన్ ప్రభుత్వాలు రహస్యంగా మీటింగులు జరిపాయి. సాధారణంగా ఏదైనా పరిశ్రమ రాష్ట్రానికి వస్తుందంటే ఏ రాష్ట్రమైన సరే గర్వంగా చెప్పుకుంటుంది. పరిశ్రమలను తెస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం అని బహిరంగంగా ప్రకటిస్తాం.
కానీ జగన్ ప్రభుత్వం ఏడాదిన్నరగా పోస్కో కంపెనీతో మీటింగులు, సమావేశాలు, చర్చలు పెట్టుకుని, ఒప్పందాలు కూడా చేసుకున్న అనంతరం కూడా ఒక్క మాట బయటకు చెప్పలేదు. గర్వంగా చెప్పుకోవాల్సిన అంశాన్ని గుట్టుగా చేయడంలోనే ఏదో మతలబు ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
విశాఖ ఉక్కు ఏదో కేంద్రం సాధారణంగా ఇచ్చిన ఒక ఫ్యాక్టరీ కాదు, ఆంధ్రులు ఆత్మ త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ఆస్తి. దానికోసం వేల మంది రైతులు తమ భూమిని ఇచ్చారు. ఇపుడు ఆ కంపెనీని, భూమిని అందరూ చీదరించుకున్న ఒక కంపెనీకి కట్టబెట్టడానికి, అది కూడా రహస్యంగా కట్టబెట్టడానికి కారణం ఏంటి? పార్లమెంటులో అడిగిన వెంటనే కేంద్రం బయటకు చెప్పేసింది. కానీ తెలిసి కూడా జగన్ ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదు అన్న ప్రశ్నకు చాలా పెద్ద వ్యాపార రహస్యం ఉందని చెబుతున్నారు.
పోస్కో కంపెనీతో జగన్ సంబంధాలు పెట్టుకున్నారని, దానికి సహకరించి వ్యక్తిగతంగా తన ఇతర కంపెనీలకు వ్యాపార లబ్ధి పొందడానికి ప్లాన్ చేయడం వల్లే ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపారని, ఈ పని రాష్ట్రం కోసం కనుక చేసి ఉంటే మొదటి మీటింగ్ లోనే విషయాన్ని బయటకు వెల్లడించేవారని అంటున్నారు. ఎపుడైతే విశాఖ ఉక్కు అమ్మేస్తున్నారని ప్రపంచానికి తెలిసిందో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. వ్యతిరేకత వస్తుంది అనుకున్నారు గాని ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని జగన్ ఊహించలేదు. కేంద్రం చేస్తున్న పని కాబట్టి చంద్రబాబు కూడా వ్యతిరేకించరు అని జగన్ భ్రమపడ్డారు. కానీ ఉద్యమానికి మొదటి మద్దతు తెలుగుదేశం పార్టీదే కావడంతో జగన్ ఖంగుతున్నారు.
అయితే, అసలే జగన్ ది వ్యాపార బుర్ర. కిందపడినా తనదే పైచేయి అనుకుంటారు. ఆ లెక్కన అతను ఎలాగైనా విశాఖ ఉక్కుతో లాభపడటానికి కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అయితే, లోగుట్టు అర్థం చేసుకున్న విశాఖ ప్రజలు జగన్ బండారం బయటపెట్టేశారు. జగన్ ఐడియా ఏంటంటే… విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని అమ్మేస్తున్నారు కాబట్టి… దానికి ఉన్న భూములు అమ్మేసి నష్టాలు పూడ్చండి అంటున్నారు.
ఈ ఐడియా గొప్ప ఐడియాగా జగన్ ఫీలవుతున్నారు. అయితే, ఇక్కడ అల్టిమేట్ గా లాభపడేది జగన్ రెడ్డే. ఎందుకంటే ఆ భూములు అమ్మకానికి పెడితే దక్కించుకునేది కచ్చితంగా జగన్ మనుషులే అన్నది అందరికీ తెలిసిందే. ఆ భూములు దక్కించుకోవడమే అసలు ప్లాన్. అయితే… ఇక్కడింకో విషయం గమనించాలి. ఈరోజు విశాఖ ఉక్కు నష్టాల్లో ఉన్నది సొంత గనులు లేకపోవడం వల్ల మాత్రమే. అంటే ఇప్పటివరకు ఉన్న నష్టాలను భూములమ్మి పూడుస్తారు. మరి గనులు లేకపోతే భవిష్యత్తులో కూడా నష్టాలు వస్తాయి కదా. మరి అపుడు ఆ నష్టాలు ఎలా పూడుస్తారు?
అయినా పరిష్కారం అన్నది శాశ్వత ప్రాతిపదికన ఉండాలి గాని ఇలా బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకుని గుడ్లన్నీ అమ్మేసుకునేలా ఉండకూడదు.
ఇపుడు విశాఖ ఉక్కు నిలబడాలి అంటే ఒకటే మార్గం.
ప్రతిపక్షాలను అన్నింటినీ కలుపుకుని, ఉద్యమకారులను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి జగన్ ధర్నా నిర్వహించాలి. ఒక ముఖ్యమంత్రి ధర్నా చేస్తే జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రాధాన్యం ఇస్తుంది. కోర్టులు జోక్యం చేసుకుంటాయి. దీనివల్ల విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆపేయొచ్చు. అయితే… ఢిల్లీకి వెళ్లి ఎదిరించే దమ్ము జగన్ కి ఎక్కడుంది అని లోకేష్ విమర్శించారు.